గోదావరిఖని, ఫిబ్రవరి 18: సాధారణంగా ఒక్క ఉద్యోగం సాధించడమే కష్టంగా ఉన్న ఈ రోజుల్లో.. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన గాదె లెనిన్ మాత్రం ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించాడు. లెనిన్ తండ్రి సింగరేణి ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టు-1లో ఫోర్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. వరంగల్, హైదరాబాద్‌లో ఉన్నత విద్యను అభ్యసించిన లెనిన్.. వరంగల్ కిట్స్‌లో బీటెక్, హైదరాబాద్ ఐఐటీలో ఎంటెక్ పూర్తి చేశాడు. గత సర్కారు నిరుడు వివిధ నోటిఫికేషన్లను విడుదల చేయగా.. లెనిన్ ముందుగా సింగరేణిలో జూనియర్ అసిస్టెంట్ కొలువు సాధించి ఈ నెల 5న ఉద్యోగంలో చేరాడు. బెల్లంపల్లిలో విధులు నిర్వహిస్తున్నాడు. గత సర్కారు 2023 మేలో నిర్వహించిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పరీక్ష రాసి.. రాష్ట్రంలోనే 8వ ర్యాంకు సాధించి ఉద్యోగం సాధించాడు. అయినప్పటికీ సింగరేణిపై ఉన్న మక్కువతో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగమే చేస్తున్నాడు. అంతేకాదు.. 2023లో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, పాలిటెక్నిక్ లెక్చరర్, గ్రూప్-4 పరీక్షలు రాయగా ఇటీవలే ఫలితాలు వచ్చాయి. అందులోనూ రాష్ట్ర స్థాయి 12వ ర్యాంకుతో అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం సాధించాడు. అలాగే 363 మార్కులతో పాలిటెక్నిక్ లెక్చరర్ ఉద్యోగం, 1,491వ ర్యాంకుతో గ్రూప్-4 కొలువు కొట్టాడు. వాటిలో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్గా పనిచేయాలని ఉందని, త్వరలోనే జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగానికి రాజీనామా చేస్తానని లెనిన్ తెలిపాడు. తన తండ్రి సమ్మయ్య ప్రోత్సాహం వల్లే తాను ఐదు ఉద్యోగాలు సాధించినట్టు లెనిన్ పేర్కొన్నాడు.