నవాబ్‌పేట, మే 18: కాళ్ల పారాణి ఆరకముందే నవవధువు బలవన్మరణానికి పాల్పడిన సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండలంలో చోటుచేసుకున్నది. ఎస్సై పురుషోత్తం తెలిపిన వివరాల ప్రకారం.. నవాబ్‌పేట మండలం గురుకుంట గ్రామానికి చెందిన అనూష (19), అదే గ్రామానికి చెందిన శివశంకర్ కొంతకాలంగా ప్రేమించుకున్నారు. ఈ క్రమంలో ఇరుకుటుంబ సభ్యులు ఒప్పుకొని ఈనెల 12న ధర్పల్లి గ్రామంలోని చెన్నకేశవ స్వామి ఆలయంలో సంప్రదాయబద్ధంగా పెండ్లి చేశారు.
వివాహం తర్వాత మూడ్రోజులకు తల్లిగారింటికి నూతన దంపతులు వెళ్లారు. రెండ్రోజుల తర్వాత వెంట తన భార్యను పంపించాలని అత్తను కోరగా.. ఇద్దరి మధ్య గొడవ జరిగినట్టు తెలిసింది. తర్వాత అనూష తల్లి, శివశంకర్ ఇంటి నుంచి బయటకు వెళ్లారు. తీవ్ర మనస్తాపం చెందిన అనూష ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే మహబూబ్‌నగర్ దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.