సత్తుపల్లి టౌన్, సెప్టెంబర్ 3 : గన్నేరు ఆకులు పడిన ఆహారం తిని అంగన్వాడీ కేంద్రంలో ఐదుగురు చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టారంలో గురువారం ఆలస్యంగా వెలుగుచూసింది. స్థానికుల కథనం ప్రకారం.. కిష్టారం అంగన్వాడీ కేంద్రంలో మూడు రోజుల క్రితం చిన్నారులకు వడ్డించిన పప్పుకూరలో గన్నేరు ఆకులు పడిన ఆహారం తిన్న చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు.
వెంటనే గుర్తించిన అంగన్వాడీ టీచర్ వారిని సత్తుపల్లి దవాఖానకు తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఖమ్మం దవాఖానకు రెఫర్ చేశారు. వారికి ప్రాణాపాయం లేదని వైద్యులు చెప్పడంతో తల్లిదండ్రులు ఊపిరిపీల్చుకున్నారు. గురువారం ఆలస్యంగా వెలుగు చూసినప్పటికీ ఇప్పటికే దీనిపై సీడీపీవో విచారణ చేపట్టినట్టు తెలిసింది. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని చిన్నారుల తల్లిదండ్రులు కోరుతున్నారు.