హైదరాబాద్/హిమాయత్‌నగర్, మే 26 (నమస్తే తెలంగాణ) : ఇంటర్ పాఠ్యపుస్తకాల ధరలకు రెక్కలొచ్చాయి. ముఖ్యంగా ఫస్టియర్ పాఠ్యపుస్తకాల ధరలు భారీగా పెరిగాయి. గరిష్ఠంగా రూ.62.. కనిష్ఠంగా రూ.16 వరకు పెంచేశారు. మొత్తంగా ఈసారి ఆరు సబ్జెక్టుల పుస్తకాల ధరలు పెంచారు. బైపీసీ కోర్సులోని బోటనీ పుస్తకం ధర రూ.174, జువాలజీ ధర రూ.190 ఉండగా, వీటి ధరల్లో మాత్రం ఏమార్పులేదు. ఈ విద్యాసంవత్సరం కొత్తగా అకౌంటెన్సీ అనే సబ్జెక్టు ప్రవేశపెట్టగా, ఈ పుస్తకం ధరను రూ.278గా ఖరారుచేశారు.
కొత్త పాఠ్యపుస్తకాలను తెలుగు అకాడమీ ముద్రించగా, ఈ పుస్తకాలు క్రమంగా కాలేజీలకు చేరుతున్నాయి. ఫస్టియర్ సిలబస్‌లో ఇంటర్‌బోర్డు ఈసారి భారీ మార్పులు చేసింది.10-15% సిలబస్ తగ్గించింది. జేఈఈ, నీట్లో లేని పాఠ్యాంశాలను తొలగించారు. గణితం, కెమిస్ట్రీ, ఫిజిక్స్ వంటి సబ్జెక్టుల సిలబస్‌కు కోతపెట్టింది. కెమిస్ట్రీలో ఏకంగా మూడు అధ్యాయాలు తొలగించారు. గణితం-1ఏలో రెండు అధ్యాయాలు చేర్చారు. ఇదే పేపర్లో ఒక పాఠ్యాంశాన్ని తొలగించారు. ఇక గణితం-1బీ పాఠ్యాంశాల్లో ఎలాంటి మార్పు లేదు.
బోటనీలో కొత్తగా రెండు పాఠ్యాంశాలు తొలగించారు. కొత్తగా ఎకనామిక్ బోటనీ అధ్యాయాన్ని చేర్చారు. జువాలజీలో డిగ్రీలో గల సెరికల్చర్, లక్క పురుగుల పెంపకం అనే రెండు అంశాలు చేర్చారు. పలు సబ్జెక్టుల సిలబస్‌కు కోత పెట్టినా.. ధరలు పెంచడం, కొన్నింటిని అలాగే ఉంచడం గమనార్హం. భారీగా సిలబస్ కోతపడిన నాలుగు పుస్తకాల ధరలు మాత్రం స్వల్పంగా తగ్గించారు. ఇంగ్లిష్, కెమిస్ట్రీ, గణితం-1ఏ, గణితం-1బీ పుస్తకాల ధరలు స్వల్పంగా తగ్గాయి. ఈ పుస్తకాల్లో సిలబస్‌ను తగ్గించడంతో పేజీల సంఖ్య తగ్గగా, పుస్తకాల ధరలు కూడా తగ్గినట్టు తెలుగు అకాడమీ వర్గాలు తెలిపాయి. హిస్టరీ, హిందీ, అరబిక్, ఉర్దూ పాఠ్య పుస్తకాలకు అంత డిమాండ్ ఉండటంలేదని అకాడమీ వర్గాలు వెల్లడించాయి.
