లక్నో: గదిలో నిద్రిస్తున్న అన్న, వదిన, వారి మూడేళ్ల కుమారుడ్ని 16 ఏళ్ల బాలుడు నరికి చంపాడు. మరో గదిలో నిద్రించిన తండ్రి వారి అరుపులకు మేల్కొని పొరుగువారిని అప్రమత్తం చేశాడు. అక్కడకు చేరుకున్న పోలీసులు ఆ బాలుడ్ని అదుపులోకి తీసుకున్నారు. (Boy Kills Brother, Sister-In-Law) ఉత్తర ప్రదేశ్లోని గోరఖ్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బలువ గ్రామానికి చెందిన 16 ఏళ్ల బాలుడు దారుణానికి పాల్పడ్డాడు. సోమవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో అతడు పడుకున్న గదిలో నిద్రిస్తున్న అన్న అమిత్ గుప్తా, వదిన రంజన, వారి మూడేళ్ల కుమారుడు రేయాన్ష్పై పదునైన ఆయుధంతో దాడి చేశాడు. గాఢ నిద్రలో ఉన్న వారిని నరికి చంపాడు.
కాగా, మరో గదిలో నిద్రిస్తున్న తల్లిదండ్రులు కేకలు విని మేల్కొన్నారు. తండ్రి ఆ గది వైపు పరుగెత్తుకుని వచ్చాడు. చిన్న కుమారుడు ఆయుధంతో గదిలోంచి బయటకు రావడం చూసి షాకయ్యాడు. గది లోపల పెద్ద కుమారుడు, కోడలు, మనవడు రక్తం మడుగులో పడి ఉండటం చూసి హతాశుడయ్యాడు. వెంటనే పొరుగువారిని అప్రమత్తం చేయడంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
మరోవైపు పోలీసులు ఆ ఇంటికి చేరుకున్నారు. ఇంటి పైఅంతస్తులోని గదిలో రక్తపు మరకలు ఉన్న ఆయుధంతో ఉన్న బాలుడ్ని అదుపులోకి తీసుకున్నారు. అతడి తండ్రి ఫిర్యాదుపై కేసు నమోదు చేశారు. ముగ్గురి మృతదేహాలను పోస్ట్మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబం నిర్వహిస్తున్న షాపునకు సంబంధించిన వివాదం దీనికి కారణం కావచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు.