Janwada Farmhouse | మణికొండ, ఆగస్టు 28 : నగర శివారు ప్రాంతంలోని శంకర్పల్లి మండలం జన్వాడ ఫాంహౌస్ ముందు ఉన్న చారిత్రక బుల్కాపూర్ ఫిరంగి నాలాపై నీటిపారుదల, రెవెన్యూ శాఖ అధికారులు బుధవారం సంయుక్తంగా సర్వే చేశారు. దాదాపు రెండు గంటలపాటు జన్వాడ గ్రామ రెవెన్యూ పరిధిలోని బుల్కాపూర్ నాలా సరిహద్దు వరకు డీజీపీఎస్ మిషన్ డిజిటల్ సర్వేను గ్రామ నక్ష ప్రకారం జిల్లా డిప్యూటీ సర్వేయర్ రత్నకుమార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ తేజ, సర్వేయర్ సాయికుమార్ నేతృత్వంలో చేపట్టారు.
ప్రదీప్‌రెడ్డికి చెందిన పాంహౌస్ ప్రధాన గేటు ముందు సర్వే మిషన్‌తో కొలతలు తీసుకున్నారు. రెవెన్యూ రికార్డుల ప్రకారం 18 నుంచి 20 మీటర్ల వెడల్పు ఉండాల్సిన నాలా అన్ని చోట్లా 4 నుంచి 6 మీటర్ల వరకే ఉన్నట్టు ప్రాథమికంగా గుర్తించినట్టు అధికారులు తెలిపారు. నాలా బఫర్‌జోన్ చాలా వరకు అంతటా ఆక్రమించినట్టు వెల్లడించారు. బుల్కాపూర్ నుంచి మొత్తంగా నాలా 21 కిలోమీటర్ల వరకు ఉంటుందని, నాలా సరిహద్దులను చుట్టుపక్కల ఉన్న సర్వే నంబర్లలోని పట్టా భూమి విస్తీర్ణంతో కలిసి పూర్తిగా కొలతలు నిర్ధారిస్తామని తెలిపారు. సర్వే నివేదికను ఉన్నతాధికారులకు అందజేసి వారి ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.
వారం నుంచీ ప్రదీప్‌రెడ్డికి చెందిన ఫాంహౌస్‌ను కూల్చివేస్తారని వస్తున్న వార్తల నేపథ్యం లో బుధవారం ఫాంహౌస్ సమీపంలో వందలాది మంది ప్రజలు గుమిగూడారు. ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠతో సర్వే తీరును ఆసక్తిగా గమనించారు. నాలాను కబ్జా చేస్తున్నారని అనేకసార్లు ఫిర్యాదులు చేసినా స్పందించని అధికారులు హడావిడిగా వచ్చి సర్వే చేస్తుండటంపై అనుమానాలు వ్యక్తంచేశారు. ఉన్నతాధికారుల ఆదేశాలమేరకే సర్వేకు వచ్చామని, ఎలాంటి కూల్చివేతలు చేయడంలేదని అధికారులు చెప్పడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. నాలా అంతటా ఆక్రమణకు గురైనట్టే ప్రదీప్‌రెడ్డి ఫాంహౌస్ ప్రధానగేటు ముందు ఉన్నదని, దీనికి అధికారులు ఎందుకు హడావుడి చేస్తున్నారో అర్థంకావడంలేదని స్థానికులు చర్చించుకోవడం కనిపించింది.