హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): శస్త్ర చికిత్సలతో చేతి గీతలు మార్చి కొంతమందిని అక్రమ పద్ధతిలో విదేశాలకు పంపిస్తున్న ఓ ముఠాను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ గురువారం నేరెడ్‌మెట్‌లోని కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. కడప జిల్లాకు చెందిన గజ్జలకొండగారి నాగ మునీశ్వర్‌రెడ్డి, తిరుపతిలో 2007లో సీఆర్ఏ(సర్టిఫికేట్ ఇన్ రేడియోలజికల్ ఎనాలసిస్ట్) కోర్సు పూర్తి చేసి, అక్కడ కృష్ణా డయోగ్నస్టిక్ సెంటర్లో రెడియోగ్రఫర్గా పనిచేస్తున్నాడు.
అతని మిత్రుడైన సాగబాల వెంకటరమణను అక్కడే అనస్తీషియా టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. కాగా, కడపకు చెందిన ఒక వ్యక్తి కువైట్‌లో వీసా గడువు పూర్తయినా అక్రమంగా ఉంటున్నాడని అక్కడి ప్రభుత్వం అతడిని డీపోర్టు చేసింది. ఈ నేపథ్యంలో అతడు శ్రీలంకకు వెళ్లి, తన చేతి వేళ్లకు శస్త్ర చికిత్సలు చేయించుకుని కొత్త చేతి ముద్రలతో వీసా పొంది తిరిగి కువైట్‌కు వెళ్లాడు. ఈ విషయాన్ని మునీశ్వర్‌రెడ్డి, వెంకటరమణలు తాము సర్జరీలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఇటీవల కువైట్ నుంచి డిపోర్టు అయిన ఇద్దరు రాజస్థాన్‌కు చెందిన వారి గురించి తెలుసుకొని వాళ్లను కలిశారు. ఇద్దరి చేతివేళ్ల రాతలను మార్చేందుకు ఒక్కొక్కరి నుంచి రూ. 25 వేలు తీసుకొని శస్త్ర చికిత్సలు చేశారు. ఆ తరువాత కేరళలకు వెళ్లి ఆరుగురికి, స్వస్థలంలో ముగ్గురికి చేతిగీతల శస్త్రచికిత్సలు చేశారు.
డిపోర్టు అయిన వారి చేతిగీతలు మార్చేయడమే ఈ శస్త్రచికిత్సల ఉద్దేశం. రెండు చేతుల ముని వేళ్లపై కోసి చర్మం తీసి, లోపలి నుంచి కొంత మాంసం తీస్తారు. ఆ తరువాత చేతి వేళ్లను తిరిగి కుట్టేస్తారు. ఇలా చేయడం వల్ల గతంలో ఉన్న చేతులలోని గీతలకు.. తాజాగా శస్త్ర చికిత్స చేసిన తరువాత ఉన్న గీతలకు తేడా వస్తుంది.. మునివేళ్లు లోపలికి వెళ్తాయి. ఈ శస్త్ర చికిత్స అయిన వెంటనే తమ పాస్‌పోర్టు పోయిందంటూ శస్త్ర చికిత్స చేసుకున్న వారు కొత్త, చిరునామాతో పాస్‌పోర్టుకు దరఖాస్తు చేస్తారు. చేతి వేళ్లకు ఉన్న గాయం మానే వరకు.. కొత్త పాస్‌పోర్టు కూడా వచ్చేస్తుంది.
ఆధార్‌కార్డులో కొత్త ఫింగర్ ప్రింట్స్‌ను నమోదు చేసుకుంటారు. తిరిగి కువైట్ వీసాకు దరఖాస్తు చేస్తారు, కొత్తవారు అనే ఉద్దేశంతో వీసా జారీ అవుతుంది. అయితే కువైట్ వీసా జారీకి సంబంధించి అత్యాధునీక టెక్నాలజీ లేకపోవడంతో ఈజీగా శస్త్ర చికిత్స చేసుకున్న వాళ్లకు వీసా వచ్చేస్తోంది. కొత్తగా తయారైన చేతి మునివేళ్ల ముద్రలు సంవత్సరం పాటు అలాగే ఉంటాయి. విశ్వసనీయ సమాచారంతో మల్కాజిగిరి ఎస్ఓటీ, ఘట్కేసర్ పోలీసులతో కలిసి ఈ ముఠాను అరెస్ట్ చేశారు. ఈ సమావేశంలో ఎస్ఓటీ డీసీపీ కె.మురళీధర్, ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ అశోక్‌రెడ్డి, ఘట్కేసర్ ఇన్స్పెక్టర్ చంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.