హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ): హోంగార్డులకు తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తున్న ఆర్థిక భద్రతను ఛిద్రం చేసేందుకు ప్రతిపక్షాలు కుయుక్తులు పన్నుతున్నాయి. లేనిపోని కట్టుకథలు అల్లి ప్రభుత్వ చిత్తశుద్ధికి, హోంగార్డు వ్యవస్థకు మకిలి పట్టిస్తున్నాయి. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా తెలంగాణ సర్కారు పోలీసులతో సమానంగా హోంగార్డులకు భద్రత కల్పిస్తున్నది. ఈ విషయం తెలిసి కూడా కళ్లుండి చూడలేని కబోదుల్లా ప్రతిపక్ష నాయకులు వ్యవహరిస్తున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ప్రత్యేకించి బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో హోంగార్డు వ్యవస్థలను పర్మినెంట్ చేయకపోయినా.. తెలంగాణలో మాత్రం వెంటనే ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని నిస్సిగ్గుగా హోంగార్డులను రెచ్చగొడుతున్నారు. ఇక వేతనాల విషయంలోనూ తెలంగాణ కంటే మెరుగ్గా బీజీపీ, కాంగ్రెస్ పాలిత వేతనాల విషయంలో ఒక్క పుదుచ్చేరి మినహా ఏ రాష్ట్రం దరిదాపుల్లో కూడా లేదు. పోలీసులతో సమానంగా నిత్యం విధుల్లో అంకితభావంతో పనిచేస్తున్న హోంగార్డుల పట్ల సీఎం కేసీఆర్, పోలీసుశాఖ ఉదారంగా వ్యవహరిస్తున్నది. అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లోనే ఎన్నో ఏండ్లుగా అరకొర జీతాలతో అష్టకష్టాలు పడుతున్న హోంగార్డులపై కేసీఆర్ వరాల జల్లు కురిపించారు.
2014లో రూ.9 వేలు.. నేడు రూ.27 వేలు
ఉమ్మడి రాష్ట్రంలో హోంగార్డులకు కేవలం రూ. 6 వేల జీతం మాత్రమే వచ్చేది. 2014 వరకూ వారి వేతనం రూ. 9 వేలే. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సీఎం కేసీఆర్ మానావతా దృక్పథంతో 2014 డిసెంబర్ 5న హోంగార్డుల జీతాన్ని రూ.9 వేల నుంచి రూ.12 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. పెంచిన జీతాలను 2015 ఏప్రిల్ నుంచి అమలు చేశారు. నెలకు రెండుసార్లు పరేడ్ అలవెన్సు పేరిట ఇస్తున్న రూ. 28ని రూ.100కు పెంచారు. ఆదివారాలు కూడా సెలవు లేకుండా, పోలీసులతో సమానంగా విధులు నిర్వర్తిస్తున్న హోంగార్డుల వేతనాన్ని 2017 డిసెంబర్ 13న రూ.12 వేల నుంచి రూ.21 వేలకు పెంచారు. మళ్లీ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వారికి 30 శాతం పీఆర్సీ ఇవ్వడంతో.. వేతనాలు అనూహ్యంగా రూ. 27 వేలకు పెరిగాయి. దీంతో 16 వేలకు పైగా హోంగార్డు కుటుంబాలు నేడు స్వరాష్ట్రంలో సగౌరవంగా జీవిస్తున్నాయి.
ప్రత్యేక అలవెన్సుల్లో తెలంగాణ టాప్!
హోంగార్డులకు ఆరోగ్యభద్రతతోపాటు ప్రత్యేక అలవెన్సులు ఇచ్చి ఆదుకోవడంలో దేశంలోని అన్ని రాష్ర్టాల కంటే తెలంగాణే ముందున్నది. ట్రాఫిక్ విభాగంలో పనిచేసే హోంగార్డులకు ట్రాఫిక్ కానిస్టేబుళ్లతో సమానంగా 30 శాతం ప్రత్యేక అలెవెన్సు ఇస్తున్నది. దీంతో ట్రాఫిక్ హోంగార్డుల వేతనాలు పట్టణాలు, నగరాల వారీగా రూ.30వేల నుంచి రూ.35వేల వరకు పెరిగాయి. రాష్ట్ర సర్కారు ప్రతిఏటా యూనిఫాం అలవెన్సు కింద రూ.7,500 ఇస్తున్నది. మహిళా పోలీసు కానిస్టేబుళ్లతో సమానంగా మహిళా హోంగార్డులకు ఆరు నెలల మెటర్నిటీ సెలవులు ఇస్తున్నది. ప్రమాదవశాత్తు విధి నిర్వహణలో హోంగార్డు చనిపోతే కుటుంబానికి రూ.5 లక్షల ప్రమాద బీమాను అమలు చేస్తున్నది. మరణాంతర కార్యక్రమాల నిర్వహణకు ఇచ్చే రూ.5 వేలను రూ.10 వేలకు పెంచింది. హోంగార్డులకు పోలీస్ యూనిట్ హాస్పిటల్స్‌లో అందిస్తున్న వైద్య చికిత్సలు హోంగార్డులకు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకొంటున్నది. ప్రస్తుతం హోంగార్డులు వారి వేతనాలు, ఇతర భత్యాలకు ప్రభుత్వం ఏడాదికి సుమారు రూ. 600 కోట్లుకుపైగా ఖర్చు చేస్తున్నది.
మమ్మల్ని పర్మినెంట్ చేస్తారనే నమ్మకం ఉంది
దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనంతగా తెలంగాణలోనే హోంగార్డులకు వేతనాలు అందుతున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. తెలంగాణలోని హోంగార్డులను క్రమబద్ధీకరించి, నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తిస్తారనే ఆశ ఉంది. సీఎం కేసీఆర్ సార్ హోంగార్డులను క్రమబద్ధీకరిస్తామని హామీ ఇచ్చి, గతంలో ఫైల్‌ను ముందుకు తీసుకెళ్లారు. ఆయన ద్వారానే మా బతుకులు బాగుపడతాయనే నమ్మకం ఉంది. అందుకే ఆయన్ని వేడుకుంటన్నాం. మా చిరు ఉద్యోగులపై దయచూపాలని కోరుతున్నాం.
– దయానంద్, హోంగార్డు
కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో రూ. 20 వేలే
తెలంగాణ ప్రభుత్వం ఏ రాష్ట్రం హోంగార్డులకు ఇవ్వలేనంత వేతనాన్ని ఇస్తున్నా.. తెలంగాణలోని బీజేపీ, కాంగ్రెస్ నాయకులు హోంగార్డులను రెచ్చగొట్టమే పనిగా పెట్టుకొన్నారు. ప్రధాని మోదీ పాలించిన గుజరాత్‌లోనే నేటికీ హోంగార్డులకు కేవలం రూ.20,200 మాత్రమే వేతనం చెల్లిస్తున్నారు. అదే తెలంగాణలో నెలకు రూ.27,630 వేతనం అందుతున్నది. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తమిళనాడు, కర్ణాటక, ఒడిశా, మహారాష్ట్రవంటి అన్ని రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కేవలం రూ.22 వేల లోపే వేతనం ఇస్తున్నారు. కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో అధికారిక లెక్కల ప్రకారం హోంగార్డుల సంఖ్య వెయ్యిలోపే ఉండటం వల్ల అక్కడి ప్రభుత్వం వారికి రోజుకు రూ.1001 అందజేస్తున్నది. ఇక కేరళలో హోంగార్డు వ్యవస్థనే అమల్లో లేదు. తెలంగాణలో పోలీసులతో సమానంగా విధులు నిర్వర్తిస్తున్న హోంగార్డుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఏటా వందల కోట్లు ఖర్చు చేస్తుండటంతో.. ప్రతిపక్షాలకు కంటిమీద కునుకు ఉండడం లేదు. ఎలాగైనా హోంగార్డులను రెచ్చగొట్టి ప్రభుత్వం మీదికి ఉసిగొల్పి రాజకీయలబ్ధి పొందాలని చూస్తున్నారు.