హైదరాబాద్, మార్చి15 (నమస్తే తెలంగాణ): నదుల అనుసంధానం పేరుతో, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సమ్మతి లేకుండా చుక్కనీరు కూడా తీసుకెళ్లే హక్కు కేంద్ర ప్రభుత్వానికి లేదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్పష్టంచేశారు. మన హక్కులు, అవసరాలు తీరిన తరువాతే ఇతర ప్రాంతాలకు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. రివర్‌బోర్డుల పేరుతో కేంద్రం మన హక్కులను హరించాలని చూస్తే ఊరుకొనేది లేదని పేర్కొన్నారు. రాష్ట్రం లేవనెత్తిన అనుమానాలు నివృత్తి చేసిన తరువాతే నదీయాజమాన్య బోర్డుల ఆదేశాలను గౌరవిస్తామని స్పష్టంచేశారు. మంగళవారం అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే..
1974లో బచావత్ ట్రిబ్యునల్ తెలంగాణ నీటి వాటాను స్పష్టంగా తేల్చిచెప్పింది. ట్రిబ్యునల్ అవార్డు సుప్రీంకోర్టు తీర్పుతో సమానం. కాబట్టి మనకు ఒక్కచుక్క కూడా అన్యాయం జరగదు. కేంద్రం రాష్ర్టాల హక్కులను హరించే క్రమంలో రివర్బోర్డులను ఏర్పాటుచేసింది. బోర్డులు మనపై కర్రపెత్తనం చేయాలని చూస్తే వ్యతిరేకించినం. కేంద్రానికి లేఖలు రాసినం. జల్‌శక్తిశాఖ నుంచి వివరణ రావాల్సి ఉన్నది. మన అనుమానాలను తీర్చిన తరువాతనే బోర్డుల ఆర్డర్‌ను గౌరవిస్తామని తేల్చిచెప్పినం. కేంద్రం చీటికీ మాటికి, వారి రాజకీయ స్వార్థం కోసం నదుల అనుసంధానం చేస్తం అంటరు.
గోదావరిని తీసుకెళ్లి ఎక్కడో కలుపుతమంటరు. ఎట్ల చేస్తరు? మన హక్కులు, అవసరాలు తీరిన తరువాతే ఇతర ప్రాంతాలకు ఇవ్వాల్సి ఉంటది. గోదావరిలో మన రాష్ర్టానికి సంక్రమించిన హక్కు సబ్-బేసిన్ వారీగా జలాలను కేటాయిస్తూ ట్రిబ్యునల్ అవార్డు ఇచ్చింది. ఆ తీర్పు ఉన్నంతకాలం మన సమ్మతి లేకుండా, అటు ఏపీ సమ్మతి లేకుండా చుక్కనీటిని కూడా ఎక్కడికీ తీసుకెళ్లలేరు. కేంద్రానికి ఆ హక్కు లేదు. ఇదే విషయాన్ని కేంద్ర జల్‌శక్తిశాఖకు, ప్రధాని మోదీకి కుండబద్దలు కొట్టిచెప్పా. వారు కూడా దానిని అతిక్రమిస్తారని అనుకోను. ఒకవేళ అదే చేయాలని చూస్తే సుప్రీంకోర్టుకు వెళ్తాం. ఖమ్మం జిల్లా మధిర, సత్తుపల్లి తదితర నియోజకవర్గాల్లోని నాగార్జునసాగర్ చివరి ఆయకట్టుకు ఎలాంటి పరిస్థితిలో నీటి కొరత ఏర్పడదు. త్వరలోనే సీతారామ ప్రాజెక్టు అందుబాటులోకి రానున్నది. తద్వారా ఆయా నియోజకవర్గాలకు పుష్కలంగా సాగునీరు అందుతుంది. అలాగని కృష్ణానదిలో కూడా మన హక్కును కోల్పోము. దానిని పరిరక్షించుకొనే చర్యలు చేపడతాం. మధిరలో ఒక కెనాల్ ఆంధ్రాలోకి వెళ్లి, మళ్లీ మన ప్రాంతంలోకి వచ్చే అవకాశం ఉన్నదని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ చెప్పారు. దానిపై ఆ జిల్లా మంత్రి, ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేయిస్తాం. వారు ఏ నిర్ణయం తీసుకుంటే దానిని అమలుచేస్తాం.