హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 11 (నమస్తే తెలంగాణ) : నిలోఫర్ దవాఖాన రిటైర్డ్ ఆర్ఎంవో, ప్రముఖ అడోలసెంట్ ఫిజీషియన్ డాక్టర్ రమేశ్‌బాబు దాంపురికి ప్రతిష్టాత్మకమైన ‘ఫెలోషిప్ ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్'(ఎఫ్ఐఏపీ) అవార్డు దక్కింది. హైటెక్‌సిటీలోని నోవాటెల్ హోటల్లో శనివారం జరిగిన 62వ జాతీయ ఐఏపీ సదస్సులో భాగంగా ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ అధ్యక్షుడు డాక్టర్ వసంత్ ఖలట్కర్ చేతుల మీదుగా రమేశ్‌బాబు అవార్డు అందుకున్నారు. చిన్నపిల్లల ఆరోగ్యం, వైద్యంలో అధునాతన చికిత్సా పద్ధతుల్లో ఉత్తమ సేవలు అందించినందుకు గానూ ఈ అవార్డును ప్రదానం చేశారు. ఈ సందర్భంగా రమేశ్‌బాబు మాట్లాడుతూ.. చిన్నపిల్లల్లో వచ్చే రోగాలకు ఆధునిక చికిత్సా పద్ధతుల కంటే జబ్బులను ఎలా కట్టడి చేయాలనే అంశాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా తన వంతు కృషి చేస్తానని తెలిపారు.