హైదరాబాద్, జూలై 24 (నమస్తే తెలంగాణ): సర్కారు బడులు కళకళలాడుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు సరికొత్త యూనిఫాంలతో మెరిసిపోతున్నారు. కార్పొరేట్ స్కూల్ విద్యార్థులను తలపిస్తున్నారు. ఈ విద్యాసంవత్సరం నుంచి ప్రభుత్వ విద్యార్థుల యూనిఫాంల కలర్ మారింది. సరికొత్త రంగులో ఉన్న యూనిఫాంలను విద్యార్థులకు పంపిణీ చేస్తున్నారు.
ప్రభుత్వమిచ్చే యూనిఫాంలు గతంలో ఒకేలా ఉండేవి. ప్యాంటు, లంగా కోసం ముదురు నీలం రంగు (నేవీ బ్లూ), షర్ట్ కోసం తెలుపు రంగు బట్టను అందజేసేవారు. దీనిని సమూలంగా మార్చిన సర్కారు.. మూడునాలుగేండ్లకొక మారు సరికొత్తగా ఆకట్టుకునే యూనిఫాంలను అందిస్తున్నది.
ఒకటో తరగతి నుంచి 12వ తరగతి వరకు అందరికీ ఒకే కలర్కోడ్ గల దుస్తులను పంపిణీ చేస్తున్నారు. ప్రస్తుతానికి ఒక జత ఇస్తుండగా, ఆగస్టులో మరో జత ఇస్తారు. 20,14,958 విద్యార్థులకు ఒక్కో యూనిఫాం కోసం అవసరమైన వస్ర్తాన్ని టెస్కో నుంచి తెప్పించారు. ఈ వస్త్రం 20 జిల్లాలకు 100 శాతం చేరగా, మిగిలిన జిల్లాలకు 80 శాతానికి పైగా వస్ర్తాన్ని పంపించారు.
జిల్లాలకు వస్త్రం చేరగానే మండలాలవారీగా పంపిణీ చేసి మహిళా సంఘాలు, దర్జీల చేత యూనిఫాంలను కుట్టించి విద్యార్థులకు అందజేస్తున్నారు. ఆగస్టు 15లోపు రెండో జతను సైతం విద్యార్థులకు అందజేస్తారు.
రెండు జతల యూనిఫాంల కోసం ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వం రూ.600 ఖర్చు చేస్తున్నది. రాష్ట్రంలోని 20 లక్షల పైచిలుకు విద్యార్థుల కోసం రూ.120.89 కోట్లు కేటాయించింది.
ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్ పాఠశాలలు, కేజీబీవీలు, అర్బన్ రెసిడెన్షియల్ స్కూళ్లు, తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాలలు, ఎయిడెడ్ విద్యాసంస్థల్లోని విద్యార్థులందరికీ ఈ యూనిఫాంలను ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్నది.