నమస్తే తెలంగాణ నెట్వర్క్ : రాష్ట్రంలో యూరియా కొరత రోజు రోజుకూ తీవ్రమవుతున్నది. ప్రభుత్వం, వ్యవసాయశాఖ ఎరువుల సరఫరాను పర్యవేక్షించేందుకు యాప్ ద్వారా బుకింగ్ విధానం అమలు చేస్తున్నప్పటికీ బుక్ చేసుకున్న రైతులకు సమీపంలోని ఫర్టిలైజర్ దుకాణాల్లో అవసరమైనంత యూరియా లభించకపోవడంతో సమస్య జఠిలమవుతున్నది. యాప్‌లో బుకింగ్ చేసినా, షాపుల వద్ద గంటల తరబడి పడిగాపులుకాయాల్సిన పరిస్థితి నెలకొన్నది.
సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో వారం రోజులుగా ఎరువుల కోసం రైతులు నిత్యం రోడ్లపైకి వచ్చి నిరసనలు, ధర్నాలు చేపడుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పంటల సీజన్‌కు ముందే ఎరువులను అందుబాటులో ఉంచేవారని రైతులు గుర్తుచేసుకుంటున్నారు. మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలోని సింగిల్‌విండోలో 1,120 బస్తాలను అధికారులు ఆన్లైన్లో ఉంచారు. దీంతో యాప్‌లో యూరియా బుక్ చేసుకున్న రైతులు బుధవారం ఉదయం 8 గంటల నుంచే సింగిల్‌విండో గోదాముకు వెళ్లారు. ఐడీ ద్వారా యూరియా బస్తాల పంపిణీ ప్రారంభించారు. సర్వర్ సమస్యతో ఒక్కో రైతుకు ఎక్కువ సమయం పట్టడంతో గంటల కొద్దీ పడిగాపులు కాశారు. నిలబడే ఓపిక లేక చెప్పులు లైన్లో పెట్టారు. తంగళ్లపల్లిలోనూ యూరియా కోసం రైతులు బారులుదీరారు.
మంత్రి పొన్నంను ప్రశ్నించిన రైతు
కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం దుద్దనపల్లికి చెందిన రైతు ఎల్లయ్య, బుధవారం ‘పల్లె పల్లెకు పొన్నం అన్న పల్లెల్లో ప్రజాపాలన’ కార్యక్రమంలో భాగంగా గ్రామానికి వచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్‌ను యూరియాపై నిలదీశారు. ‘సారూ.. ప్రభుత్వం యాప్‌లో ఎరువులు బుక్ చేసుకోమంటున్నది. నాకేమో పెద్దఫోన్ లేదాయే. మరి నాకు ఎరువులు ఎట్ల రావాలే? అని ప్రశ్నించాడు. మంత్రి స్పందించి.. ప్రజా సమస్యలను తెలుసుకునేందుకే తాను గ్రామాలకు వస్తున్నానని, సమస్యలు తెలిపితే పరిష్కరిస్తామని అన్నారు. స్మార్ట్‌ఫోన్ లేని రైతులకు ఎరువులు అందేలా వ్యవసాయశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.