హైదరాబాద్ సిటీబ్యూరో/వెంగళ్రావునగర్, మే 22 (నమస్తే తెలంగాణ): ఫ్రెండ్లీ పోలీసింగ్ మంటగలిసింది.. తమపై దాడి జరిగింది.. న్యాయం చేయాలంటూ ఫిర్యాదు చేయడానికి వచ్చిన దంపతులపట్ల ఓ మహిళా ఎస్ఐ దౌర్జన్యానికి దిగారు. భార్య కండ్ల ముందే భర్త మర్మాంగాలపై కాలితో తన్నినట్టు బాధితులు చెప్తున్నారు.
అంతటితో ఆగకుండా వారిని కులంపేరుతో దూషించినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఈ నెల 17న మధురానగర్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఓ వైన్స్ షాప్ యజమానితో కుమ్మక్కైనట్టు ఆరోపణలు వస్తుండగా.. పోలీసులు బాధితులపై రెండు కేసులు, వైన్‌షాప్ యజమానిపై ఒక కేసు నమోదు చేసినట్టు తెలిసింది.
ఈ నెల 17న వెంగళ్‌రావునగర్‌కు చెందిన సినిమాటోగ్రాఫర్ ఎర్రోళ్ల రమేశ్ మధురానగర్‌లోని మధురా వైన్స్ వద్దకు వెళ్లి ఆన్లైన్లో పేమెంట్ చేసి మద్యం ఇవ్వాలని అడిగాడు. దుకాణంలోని సిబ్బంది తమకు పేమెంట్ జరిగినట్టు ఇంకా మెసేజ్ రాలేదని కొద్దిసేపు ఆగాలని అన్నారు. ఎంతకీ దుకాణం సిబ్బంది మద్యం సీసా ఇవ్వకపోవడంతో రమేశ్ వారిని నిలదీశాడు. ఇద్దరి మధ్య వాగ్వావాదం పెరిగింది.
ఇంతలో దుకాణంలోని సిబ్బంది బయటకు వచ్చి ఓ ఖాళీ సీసాతో రమేశ్ తలపై కొట్టారు. భర్త తల నుంచి రక్తం కారడం చూసి తట్టుకోలేక అతని భార్య దుకాణంలోకి వెళ్లి సిబ్బందిపై దాడి చేసిందని పోలీసులు చెప్తున్నారు. మద్యం దుకాణం సిబ్బందిపై, పోలీస్ కానిస్టేబుల్‌పై దాడి చేసినందుకు రమేశ్, అతని భార్య మీద, రమేశ్ మీద దాడి చేసినందుకు మద్యం దుకాణం సిబ్బంది మీద కేసులు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు.
జరిగింది ఇది: బాధితులు
వైన్స్ సిబ్బంది తమపై దాడి చేసిన విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు మధురానగర్ ఠాణాకు వెళ్లామని రమేశ్ దంపతులు చెప్పారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న ఓ మహిళా ఎస్ఐ తమ ఫిర్యాదు తీసుకోకపోగా తమను దుర్భాషలాడారని అన్నారు. తమను ముందుగా ఎమ్మెల్సీ (మెడికో లీగల్ కేసు) నమోదు చేసేందుకు వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకొని రావాలని ఆదేశించారని తెలిపారు.
నిబంధనల ప్రకారం తమతో ఒక పోలీసును పంపాలని కోరగా తమనే వెళ్లాలని గద్దించారని చెప్పారు. వారిద్దరూ ఎస్ఆర్నగర్లోని ప్రభుత్వ దవాఖానకు వెళ్లి వైద్య పరీక్ష చేయించుకొని తిరిగి వస్తుండగా.. ఇంతలో ఓ కానిస్టేబుల్ తమకు ఫోన్ చేశాడని తెలిపారు. వైన్స్ షాప్‌లో తమపై దాడిచేసిన వారెవరో గుర్తించేందుకు తిరిగి తమను మధురా వైన్స్ వద్దకు రమ్మని చెప్పాడన్నారు.
నిందితులను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి విచారించాలి కదా అని తాము కోరగా.. లేదు తమను వైన్స్ వద్దకే రావాలని కానిస్టేబుల్ ఒత్తిడి చేశారని తెలిపారు. తామిద్దరం మద్యం దుకాణం వద్దకు వెళ్లగానే ఆ సిబ్బంది తమపై మరోసారి దాడి చేశారని చెప్పారు. ఈ దృశ్యాలను రమేశ్ భార్య వీడియో తీస్తుండగా.. ఆ సిబ్బంది కానిస్టేబుల్ సమక్షంలోనే ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించారని తెలిపారు. ఆ తరువాత రమేశ్ భార్య జేబులో నుంచి కానిస్టేబుల్ సెల్‌ఫోన్ లాక్కున్నాడని అన్నారు.
దీనంతటిపై పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి మహిళా ఎస్ఐకి వివరించగా, ఆమె తమనే తప్పుపట్టారని చెప్పారు. ఎస్ఐ తమను కులం పేరు అడిగారని, తమది ఎస్సీ కులమని చెప్పగానే.. కులం పేరుతో దూషించారని ఆవేదన వ్యక్తంచేశారు. అంతటితో ఆగకుండా రమేశ్‌ను అతని భార్య ఎదుటే కొడుతూ అతని మర్మాంగాలపై మూడుసార్లు తన్నిందని చెప్పారు.
తమపై జరిగిన దాడి ఘటనలను అక్కడి సీసీటీవీ కెమెరాలలో చూసి తెలుసుకోవచ్చని అన్నారు. రోజంతా పోలీస్‌స్టేషన్‌లోనే ఉంచారని, మరుసటి రోజు ఏసీపీ వచ్చిన తరువాత వదిలిపెట్టారని రమేశ్ చెప్పారు. బాధితులమైన తమను కులం పేరుతో దూషించడం, హింసించారని ఆరోపిస్తూ ఎస్సీ కమిషన్‌లో ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. బాధితుల ఆరోపణలపై విచారణకు ఆదేశించామని వెస్ట్‌జోన్ డీసీపీ విజయ్‌కుమార్ చెప్పారు.