తొర్రూరు, మే 30 : ‘బోనస్ డబ్బులు ఎప్పుడొస్తయి సారూ’ అంటూ ఓ మహిళా రైతు అధికారులను ప్రశ్నించగా, వారు సమాధానం చెప్పకుండా వెళ్లిపోయారు. శుక్రవారం అదనపు కలెక్టర్ వీరబ్రహ్మచారితోపాటు పలువురు అధికారులు మహబూబాబాద్ జిల్లా అమ్మాపురం, మాటేడు గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా అమ్మాపురం గ్రామానికి చెందిన మహిళా రైతు గుంటుక సోమలక్ష్మి తన గోడును వెళ్లబోసుకున్నారు. ‘మాకు యాసంగి బోనస్ డబ్బులు ఇప్పటికీ పడలేదు. ఎందుకు రాలేదని అడిగితే అదనపు కలెక్టర్ ఏం చెప్పకుండా కారెకి వెళ్లిపోయారు’ అని సోమలక్ష్మి ఆవేదన వ్యక్తంచేసింది. ‘గత వానకాలంలో 3 ఎకరాల్లో ధాన్యం పండించిన. దాదాపు 18 క్వింటాళ్ల వడ్లను ప్రభుత్వ మారెట్లో అమ్మినా రూపాయి బోనస్ కూడా మా ఖాతాలోకి రాలేదు. రూ.9 వేల బోనస్ డబ్బులు వస్తాయని ఆశపడ్డా.. కానీ, ఇప్పటికీ పైసా రాలేదు. ఇక ఇప్పుడు యాసంగి పంటను అప్పు తెచ్చి సాగు చేసిన.
వడ్లు చేతికొచ్చాక కొనుగోలు కేంద్రానికి తీసుకుపోయిన. 30 రోజులైనా ఒక గింజ కూడా కాంటా వేయలేదు. పాత బకాయిలు ఇవ్వకుండా, కొత్త పంట కూడా తీసుకోకపోతే మేమెలా బతుకుతాం? ఇప్పుడు వానకాలం పంట కోసం దుకి దున్నుతున్నం. కానీ, పైసలు లేవు. పాత బకాయిలు రాకపోవడంతో కొత్త పనులు ప్రారంభించలేక ఇబ్బంది పడుతున్నం. సర్కార్ వెంటనే స్పందించి గత వానకాలం, యాసంగి పంటల బోనస్ డబ్బులను విడుదల చేయాలి’ అని ఆమె వేడుకున్నది. కాగా అదనపు కలెక్టర్ వెంట జిల్లా పౌరసరఫరాల అధికారి ప్రేమ్‌కుమార్, జిల్లా పౌర సరఫరాల మేనేజర్ కృష్ణవేణి, డీపీఆర్వో రాజేంద్రప్రసా ద్,తహసీల్దార్ శ్రీనివాస్, ఏవో రాంనర్సయ్య, ఆర్ఐ బషీర్, పీఏసీఎస్ సిబ్బంది ఉన్నారు.