హైదరాబాద్, మే 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వచ్చే రెండేండ్ల వరకు ఇంజినీరింగ్ కళాశాలల్లో ట్యూషన్ ఫీజులే పెంచవద్దని, తాజాగా ఫీజుల పెంపు యోచనను వెంటనే నిలిపివేయాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాసయాదవ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో శుక్రవారం మీడియాతో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలలో విచ్చలవిడిగా ట్యూషన్ ఫీజులు పెంచుతున్నారని, రూ.1.60 లక్షల వరకు ఉన్న ట్యూషన్ ఫీజును ఏకంగా రూ.2.80 లక్షల వరకు పెంచారని, ఇంత పెద్ద మొత్తం ఫీజులను పేద విద్యార్థులు ఎలా భరిస్తారని ప్రశ్నించారు. ఫీజుల నియంత్రణపై సీఎం ఎందుకు చొరవ తీసుకోవడం లేదని నిలదీశారు.
అందాల పోటీలపై సీఎం రేవంత్‌రెడ్డికి ఉన్న శ్రద్ధ విద్యార్థులపై ఎందుకు లేదని నిలదీశారు. తాము అధికారంలోకి వస్తే ఇంజినీరింగ్ విద్యను ఉచితం చేస్తామని, ప్రతి విద్యార్థికి రూ.5 లక్షల చొప్పున ప్రభుత్వమే ఇస్తుందని, ప్రభుత్వమే ట్యూషన్ ఫీజులను భరిస్తుందంటూ కాంగ్రెస్ ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడిచినా విద్యాశాఖను నిర్వహిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి.. ఇంతవరకు ఆ శాఖ బాగోగులపై, ట్యూషన్ ఫీజుల నియంత్రణపైనా ఇప్పటివరకు ఎలాంటి సమీక్ష సమావేశం నిర్వహించలేదని దుయ్యబట్టారు.
ట్యూషన్ ఫీజుల పెంపు కోసం ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీ యాజమాన్యాలు సమర్పించిన నివేదికలపై అనేక అనుమానాలు ఉన్నాయని గెల్లు శ్రీనివాసయాదవ్ తెలిపారు. ఆ నివేదికల నిగ్గు తేల్చాలంటే థర్డ్‌పార్టీతో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. టీఎఫ్ఆర్సీ ఆడిటర్లు కూడా కుమ్మక్కై ఫీజుల పెంపునకు సహకరిస్తున్నారని దుయ్యబట్టారు. యాజమాన్యాలకు తలొగ్గకుండా ప్రభుత్వం ఫీజులను నియంత్రించాలని డిమాండ్ చేశారు. ఫీజుల పెంపుతో రాష్ట్రంలోని లక్ష కుటుంబాలపై భారం పడుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. రాష్ట్రంలోని కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలు సిండికేటై మోసానికి తెరలేపాయని మండిపడ్డారు. సమావేశంలో బీఆర్ఎస్వీ ఉపాధ్యక్షుడు తుంగబాలు తదితరులు పాల్గొన్నారు.