హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో జీవవైవిధ్యంతో సరికొత్తగా థీమ్ పార్కులు ఏర్పాటుకానున్నాయి. పిల్లలు, విద్యార్థుల్లో ఆసక్తి కలిగించి, విజ్ఞానం పెంపొందించేలా వినూత్నంగా వనాలు సృష్టించాలని అటవీ అభివృద్ధి సంస్థ (ఎఫ్డీసీ) సంకల్పించింది. వంద ఎకరాల విస్తీర్ణంలో రెండు వేల రకాల వివిధ జాతులకు చెందిన లక్ష మొక్కలను ఈ వర్షాకాలంలో నాటేలా కార్యాచరణ సిద్ధం చేసుకున్నది. విద్యార్థులు, చిన్నారులకు మొక్కల గురించి, వాటి ఉపయోగాలు, అవి పెరిగే విధానానికి సంబంధించిన విజ్ఞానం పెంపొందించేందుకు ఎఫ్‌డీఐ ప్రయత్నిస్తున్నది.
200 నుంచి 500 గజాల్లో చిన్న చిన్నగా 75 థీమ్ పార్కులు అందుబాటులోకి తీసుకురానున్నది. వీటిలో దాదాపు లక్ష మొక్కలు నాటాలన్నది లక్ష్యం. ఒక థీమ్ పార్కులోకి వెళితే తెలుగు అక్షరాలు నేర్చుకోవచ్చు. మరో దాంట్లో ఏ నుంచి జడ్ వరకు ఆంగ్ల అక్షరాలు చదవచ్చు. ఇంకో చోట బొమ్మల తయారీకి వాడే చెట్ల గురించి, మరో చోట సంగీత పరికరాలకు వాడే కలప మొక్కల వివరాలు తెలుసుకోవచ్చు. సంస్కృతి సంప్రదాయాలు, ఔషధాల గురించి.. ఇలా ఒక్కోటి ఒక్కో ప్రత్యేకతతో అలరించేలా మొక్కలను నాటి పెంచేందుకు ఎఫ్డీసీ ప్రణాళిక
రెడీ చేసింది.
వినూత్నంగా ఉండేలా థీమ్ పార్కులు
థీమ్ పార్కులు చిన్నారుల్లో ఆలోచనలను రేకెత్తించి, విజ్ఞాన్ని పెంచేలా ఉంటాయి. వాటికి పెట్టే పేర్లకు తగ్గట్టు ఉండనున్నాయి. ప్రపంచంలోనే వినూత్నంగా ఉండేలా బొటానికల్ గార్డెన్‌ను అభివృద్ధి చేస్తాం. విదేశాల్లోని వివిధ రకాల మొక్కలను ఈ థీమ్ పార్కులో నాటుతాం. ప్రయోగాత్మకంగా సీతాకోకచిలుక ఆకారంలో బటర్‌ఫ్లై గార్డెన్ ఏర్పాటు చేశాం. చిన్నచిన్న పూల మొక్కలపై సీతాకోక చిలుకలు వచ్చి వాలేలా రూపొందించాం. మిగిలిన పార్కులను వర్షకాలం పూర్తయ్యేలోపు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. పెన్సిల్, రబ్బర్ వంటివి ఏ చెట్ల నుంచి వస్తాయి వంటి విషయాన్ని పిల్లలు తెలుసుకొని విజ్ఞానం పొందేలా రూపొందిస్తున్నాం. ఈ తరహా ఏర్పాట్ల వల్ల పిల్లల మనసుల్లో మొక్కలపై ప్రేమ పెరుగుతుంది. వాటితో బంధం బలపడుతుంది.
–అటవీ అభివృద్ధి సంస్థ ఎండీ చంద్రశేఖర్‌రెడ్డి