
పటాన్చెరు, డిసెంబర్ 27: విద్యుదాఘాతంతో తండ్రీకూతురు మృతిచెందగా, తల్లికి తీవ్రగాయాలైన ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇస్నాపూర్‌లో సోమవారం చోటుచేసుకున్నది. వివరాల్లోకి వెళ్తే.. ఒడిశాలోని జగత్సింగ్పూర్ జిల్లా జాగిపూర్కు చెందిన బాసుదేవ్ మల్లిక్ (36) పదేండ్ల క్రితం ఇస్నాపూర్‌కు వలస వచ్చాడు. గ్రామంలోనే అద్దెకు ఉంటూ ఓ పరిశ్రమలో పని చేస్తున్నాడు. అతనికి భార్య రీనామల్లిక్, ఇద్దరు కూతుర్లు దీప (6), కున్ను (2) ఉన్నారు. రెండో అంతస్తులో ఉంటున్న బాసుదేవ్ మల్లిక్ ఇనుప రాడ్‌తో పనిచేస్తున్న సమయంలో రాడ్ ఇంటి ముందున్న 11 కేవీ విద్యుత్ తీగలకు తగిలింది. దీంతో బాసుదేవ్ మల్లిక్ విద్యుదాఘాతానికి గురై రెయిలింగ్పైనే చనిపోయాడు. నాన్నకు ఏదో జరిగిందని గుర్తించిన రెండేండ్ల చిన్నారి కున్ను వెళ్లి తండ్రి కాళ్లను ముట్టుకున్నది. దీంతో బాలిక కాలి ముద్దయ్యింది. తండ్రీకూతురికి కరెంట్‌షాక్ తగలడం చూసిన రీనామల్లిక్.. వారిద్దరినీ కాపాడే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో ఆమెకు కూడా విద్యుత్తు షాక్ తగిలి గాయాలయ్యాయి. తండ్రీకూతురు ఘటనా స్థలంలోనే మృతిచెందారు. ఎదుటి బిల్డింగ్ నుంచి ఘటనను చూసిన స్థానికులు విద్యుత్తుశాఖ అధికారులకు సమాచారం ఇచ్చి కరెంట్‌ను నిలిపివేయించారు. తండ్రి శవం వద్దనే చిన్నారి కాలి ముద్దవ్వడం చూపరులను కంటతడి పెట్టించింది. తీవ్రంగా గాయపడిన రీనాను చందానగర్‌లోని ప్రైవేట్ దవాఖానకు తరలించారు. మెరుగైన చికిత్స కోసం అక్కడినుంచి హైదరాబాద్‌లోని గాంధీ దవాఖానకు తరలించారు. వీరి ఆరేండ్ల కూతురు దీప బడిలో ఉండటంతో ప్రాణాలతో బయటపడింది.