బోస్టన్: 2026 ఫిఫా వరల్డ్‌కప్ నాకౌట్ దశ రసవత్తరంగా మొదలైంది. నాలుగు సార్లు వరల్డ్‌కప్ గెలిచిన జర్మనీ.. టోర్నీ నుంచి ఔట్ అయ్యింది. పరాగ్వేతో జరిగిన థ్రిల్లర్ పెనాల్టీ షూటౌట్లో జర్మనీ ఓడింది. తొలుత రెండు జట్లు ఎక్స్ట్రా టైంలోనూ 1-1 గోల్స్‌తో సమంగా నిలిచాయి. కానీ పెనాల్టీ షూటౌట్లో 4-3 తేడాతో పరాగ్వేను విజయం వరించింది. పరాగ్వే గోల్ కీపర్ ఓర్లాండో గిల్ అద్భుతమైన రీతిలో గోల్ కీపింగ్ చేశాడు. జర్మనీ టాప్ ప్లేయర్లు కేయి హర్వేజ్, నిక్ వోల్ట్మోడ్ కొట్టిన గోల్స్‌ను ఓర్లాండో గిల్ అద్భుతంగా సేవ్ చేశాడు.
తొలుత పరాగ్వే ప్లేయర్ జులియో ఎన్సిసో ఫస్ట్ హాఫ్‌లోనే గోల్ చేసి జట్టుకు ఆధిక్యాన్ని అందించాడు. అతను ఆట 42వ నిమిషంలో గోల్ చేశాడు. ఇక సెకండ్ హాఫ్‌లో జోరందుకున్న జర్మనీ ఓ గోల్ చేసి మ్యాచ్‌పై ఆసక్తిని పెంచింది. 54వ నిమిషంలో హర్వేజ్ గోల్ చేసి జర్మనీకి ఊపిరినిచ్చాడు. హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో పరాగ్వే గోల్ కీపర్ హోర్లాండ్ అద్భుతమైన సేవ్స్ చేశాడు. ఇక ఈ యేటి వరల్డ్‌కప్‌లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్ పెనాల్టీ వరకు వెళ్లింది.
పెనాల్టీ షూటౌట్లో జర్మనీ ఆటగాళ్లు హర్వేజ్, వోల్ట్మేడ్, తాహ్ కొట్టిన గోల్స్‌ను ఆపడంతో పరాగ్వేను విజయం వరించింది. మ్యాచ్ ఆద్యంతం పరాగ్వే తన డిఫెండింగ్ స్కిల్స్‌ను ప్రదర్శించింది. మ్యాచ్‌ను ఎక్స్ట్రా టైం వరకు తీసుకెళ్లింది. తాహ్ కొట్టిన ఓ గోల్ నెట్లోకి వెళ్లినా.. వీఏఆర్ ప్రకారం ఆ గోల్‌ను రూలౌట్ చేశారు. వాల్డేమర్ ఆంటన్ ప్లేయర్ ఫౌల్కు పాల్పడినట్లు వీడియో ద్వారా తేల్చారు. దీంతో కీలకమైన దశలో 2-1 ఆధిక్యాన్ని జర్మనీ మిస్ అయ్యింది.
షూటౌట్లో జర్మనీ తొలి షాట్ ఆడింది. కానీ హర్వేజ్ దాన్ని మిస్ చేశాడు. అయితే షూటౌట్లో వరల్డ్‌కప్ మ్యాచ్‌ను జర్మనీ తొలిసారి ఓడిపోయింది. 1954, 1974, 1990 , 2014 సంవత్సరాల్లో వరల్డ్‌కప్ గెలిచిన జర్మనీ.. వరుసగా మూడో ప్రపంచ టోర్నీలో ఓటమి చవిచూసింది. 2018లో మెక్సికో, దక్షిణ కొరియా చేతిలో జర్మనీ పరాజయం పాలైంది. 2022లోనూ జపాన్ చేతిలో ఓడి గ్రూప్‌లో మూడవ స్థానంలో నిలిచింది. ఇక ఈసారి ఫిఫా ర్యాంకుల్లో 41వ స్థానంలో ఉన్న పరాగ్వే చేతిలో జర్మనీ ఓటమి ఎదుర్కొన్నది.
గ్రూపు డీకి చెందిన పరాగ్వే తన తొలి మ్యాచ్‌లో అమెరికా చేతిలో 4-1 తేడాతో ఓటమి పాలైంది. కానీ ఆ తర్వాత ఆ జట్టు కాస్త తేరుకుని ఆ గ్రూపులో మూడవ స్థానంలో నిలబడింది. జర్మనీతో మ్యాచ్‌లో ఆరు ఫీట్ల ఆరు ఇంచులు ఉన్న గోల్‌కీపర్ ఓర్లాండో గిల్ పరాగ్వే హీరోగా మారాడు. ఇప్పటి వరకు వరల్డ్‌కప్ చరిత్రలో అయిదు సార్లు జర్మనీ పెనాల్టీ షూటౌట్ ఆడింది. మొదటిసారి ఆ దేశం షూటౌట్లో చేతులెత్తేసింది.
ఇక ప్రి క్వార్టర్స్‌లో ఫ్రాన్స్ లేదా స్వీడన్‌తో పరాగ్వే మ్యాచ్ ఆడే అవకాశం ఉన్నది. ఫిలడెల్ఫియాలో శనివారం ఆ మ్యాచ్ జరగనున్నది.