మహబూబాబాద్ : వరంగల్ జిల్లాలో కారు అదుపుతప్పి ఎస్సారెస్పీ కాలువలో పడిన ఘటనలో గల్లంతైన తండ్రీ, కుమార్తెల మృతదేహాలు లభ్యమయ్యాయి. ప్రమాదం జరిగిన ప్రాంతానికి 200 మీటర్ల దూరంలో కారులోనే తండ్రీ కుమార్తెల మృతదేహాలు లభించాయి. కారును బయటికి లాగి మృతదేహాలను వెలికితీశారు. శనివారం ఉదయం వరంగల్ జిల్లా సంగెం మండలం తీగరాజుపల్లి వంతెనపై కారు అదుపుతప్పి ఎస్సారెస్పీ కాలువలో పడిపోయింది.
మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం మేచరాజుపల్లి గ్రామానికి చెందిన దంపతులు తమ ఇద్దరు పిల్లలతో కారులో వరంగల్ వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు రంగంలోకి దిగి రెండేళ్ల బాలుడి మృతదేహాన్ని వెలికితీశారు. బాలుడి తల్లిని ప్రాణాలతో కాపాడారు. తండ్రి, కుమార్తె గల్లంతయ్యారు. వారి కోసం గజ ఈతగాళ్లు, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఉదయం గాలించారు. ఎట్టకేలకు తండ్రీకుమార్తెల మృతదేహాలను వెలికి తీశారు.
ఎల్ఐసీ డెవలప్మెంట్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న సోమారపు ప్రవీణ్ కుమార్ (30) ఇవాళ ఉదయం తన భార్య క్రిష్ణవేణి, కుమార్తె చైత్రసాయి (4), కుమారుడు సాయివర్ధన్ (2) తో కలిసి వెళ్తుండగా ఛాతిలో నొప్పి రావడంతో కారుపై నియంత్రణ కోల్పోయినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. మృతదేహాల గాలింపును సులభతరం చేయడం కోసం పరవళ్లు తొక్కుతున్న ఎస్సారెస్పీ నీల్లు మహబూబాబాద్‌కు మళ్లించారు. ఇన్స్పెక్టర్ పార్వతి రెస్క్యూ ఆపరేషన్‌ను పర్యవేక్షించారు.
ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కొన్నాళ్ల క్రితం కూడా ఇదే ప్రదేశంలో ఇలాంటి ప్రమాదమే జరిగిందని చెప్పారు. ఈ ప్రమాద ఘటనతో మేచరాజుపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి.