హైదరాబాద్, జూన్ 14 (నమస్తే తెలంగాణ): సూర్యాపేట – ఖమ్మం జాతీయ రహదారి నిర్మాణం పూర్తి కావచ్చింది. ఈ ఏడాది సెప్టెంబర్ నెలాఖరు వరకు వంద శాతం పనులు పూర్తయి అందుబాటులోకి రానున్నది. రూ. 2,094.15 కోట్లతో 58.63 కిలోమీటర్ల మేర ఈ రహదారిని నిర్మిస్తున్నారు. నాలుగు వరుసల ఈ రహదారి నిర్మాణం కోసం జాతీయ రహదారుల సంస్థ టెండర్ పిలిచింది.
టెండర్ దక్కించుకొన్న అదాని గ్రూప్ టీపీఎఫ్ గెటిన్సా ఈరో స్టూడియోతో కలిసి కన్సార్టియంగా ఏర్పడి సూర్యాపేట-ఖమ్మం రోడ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో పనులు చేపట్టింది. టెండర్ ప్రక్రియ పూర్తి చేసుకొని 2019 డిసెంబర్ 27వ తేదీన అపాయింట్ అయింది. అప్పటి నుంచి 910 రోజుల్లో పనులు పూర్తి చేయాలన్న ఒప్పందం ఉండగా, కొవిడ్ కారణంగా పనులు కాస్త ఆలస్యం కావడంతో మరో మూడు నెలలు షెడ్యూల్ పొడిగించాలని నిర్మాణం సంస్థ కోరింది. ఈ మేరకు జాతీయ రహదారుల సంస్థ మూడు నెలలు అదనపు సమయాన్ని ఇచ్చింది. ఇప్పటివరకు 49.55 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం పూర్తయిందని, మిగిలిన 9 కిలోమీటర్ల పని సెప్టెంబర్ నాటికి పూర్తవుతుందని జాతీయ రహదారుల సంస్థ హైదరాబాద్ రీజనల్ ఆఫీసర్ కృష్ణప్రసాద్ తెలిపారు. పనులు సకాలంలో పూర్తిచేయడానికి నిత్యం తనిఖీలు నిర్వహిస్తున్నామని, సెంట్రల్ మీడియంలో మొక్కలు నాటుతున్నామని ఆయన పేర్కొన్నారు.