హైదరాబాద్, జనవరి 16 (నమస్తే తెలంగాణ): సైబర్ నేరాలు, ఆర్థిక మోసాలు పెద్దఎత్తున జరుగుతున్న నేపథ్యంలో కేసుల దర్యాప్తు పోలీసులకు సవాల్‌గా మారుతున్నది. కొన్ని కేసుల్లో మోసగాళ్లు బాధితుల ఖాతాలను కొల్లగొడుతున్నారు. ఫిర్యాదు అందిన తర్వాత బాధితులు కోల్పోయిన మొత్తాన్ని తిరిగి రాబట్టడం కోసం పోలీసులు చర్యలు తీసుకుంటారు. అయితే ఈ ప్రక్రియ వేగవంతంగా జరిగేలా కేంద్ర ప్రభుత్వం పలు విధానాలను అందుబాటులోకి తీసుకొచ్చిందని, ఈ పద్ధతులు సత్ఫలితాలు ఇచ్చే అవకాశమున్నదని నిపుణులు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్ట్ పోర్టల్(ఎన్సీఆర్పీ) ఆధ్వర్యంలో సైబర్ ఫైనాన్షియల్ క్రైమ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ (సీఎఫ్ఆర్ఎంఎస్)ను పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు కొత్త స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్వోపీ)కి కేంద్ర హోంశాఖ ఆమోదం తెలిపిందని చెప్తున్నారు.
కొత్త ఎస్వోపీ నిబంధనల ప్రకారం రూ.50,000 కంటే తకువ మొత్తంలో జరిగిన సైబర్ ఆర్థిక మోసాల కేసుల్లో కోర్టు ఆదేశం అవసరం లేకుండానే బాధితులకు రిఫండ్ అందించే అవకాశమున్నదని వివరిస్తున్నారు. కేంద్ర హోంమంత్రిత్వశాఖకు చెందిన ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (ఐసీసీసీసీ) లెక్కల ప్రకారం దేశంలో ఆరేండ్లలో సైబర్ నేరాలు, ఆర్థిక మోసాల కేసుల్లో బాధితులు రూ.52,976 కోట్లకు పైగా కోల్పోయారని సైబర్ నిపుణుడు, జియోటస్.కామ్ సీఈవో విక్రమ్ సుబ్బురాజ్ తెలిపారు. సైబర్ నేరాల కేసులను పోలీసు దర్యాప్తు చేస్తున్నప్పుడు బ్యాంకులు, పేమెంట్ అగ్రిగేటర్లు, నాన్‌బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు, ఈ-కామర్స్ ప్లాట్ ఫారంలు, స్టాక్ట్రేడింగ్ యాప్‌లు, మ్యూచువల్ ఫండ్ సంస్థలు అనుసరించాల్సిన ప్రక్రియ కొత్త ఎస్వోపీ ద్వారా వేగవంతం కానున్నదని వివరించారు.