పాన్గల్, అక్టోబర్ 3 : సాగునీరు ఇవ్వాలని మళ్లీ రైతులు రోడ్డెక్కారు. వనపర్తి జిల్లా పాన్గల్ మండలం దవాజీపల్లికి చెందిన రైతులు శనివారం ఆందోళనకు దిగారు. దవాజీపల్లి స్టేజీ వద్ద కొల్లాపూర్-వనపర్తి ప్రధాన రహదారిపై ధర్నా చేపట్టారు. ఎండలు తీవ్రంగా ఉండటంతో పంటలు ఎండిపోతున్నాయని వాపోయారు. మంత్రి జూపల్లి కృష్ణారావు, ఇరిగేషన్ అధికారులకు విన్నవించినా సమస్య పరిష్కారం కావడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. పంటలు ఎండుముఖం పట్టాయని, వెంటనే సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు.
వీరి ఆందోళనలకు మాజీ ఉపసర్పంచ్ కృష్ణయ్యగౌడ్, బీఆర్ఎస్ నాయకుడు చిన్నమాసిరెడ్డి ఆంజనేయులు మద్దతు తెలిపి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ హయాంలో ఎంజీకేఎల్ఐ డీ-28 మెయిన్ కెనాల్ అనుసంధానంగా ఎంజే-4 కాలువ ద్వా రా సాగునీరు అందేదని గుర్తుచేశారు. రోడ్డుపై వాహనాలు నిలిచిపోవడంతో ఎస్సై కురుమయ్య సిబ్బందితో వచ్చి రైతులను సముదాయించి ఆందోళన విరమింపజేశారు.