కాగజ్‌నగర్, ఏప్రిల్ 7 : సాగు నీటిని అందించాలని కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మండలం బురదగూడ, వంజిరి గ్రామాల రైతులు అధికారులను కోరారు. ఈ రెండు గ్రామాలకు సంబంధించిన మినీ రిజర్వాయర్ కట్ట గతేడాది తెగిపోగా, దానికి మరమ్మతులు చేసి సాగు నీటిని అందించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కన్వీనర్ ముంజం ఆనంద్‌కుమార్ కోరారు. ఈ మేరకు సోమవారం రైతులతో కలిసి కాగజ్‌నగర్ ఈఈ ప్రభాకర్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ రిజర్వాయర్ కట్ట తెగిపోవడంతో ఈ రెండు గ్రామాల శివారులో దాదాపు 400 ఎకరాలకు సాగు నీరందడం లేదని, ఇందులో నిత్యం నీరు ఉండేలా చూడాలని కోరారు. కుమ్రం భీం రిజర్వాయర్ నుంచి ఈ మినీ రిజర్వాయర్‌లోకి నీరు వచ్చేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.