ఇబ్రహీంపట్నం, ఆగస్టు 16 : లోవోల్టేజీ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం వర్షకొండకు చెందిన సుమారు 200 మంది రైతులు ఆందోళనకు దిగారు. శుక్రవారం వర్షకొండ సబ్‌స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం ట్రాన్స్‌కో ఏఈ సతీశ్‌కు వినతిపత్రాన్ని అందించి, లోవోల్టేజీ సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ. నాలుగు రోజులుగా వ్యవసాయానికి తరచూ విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో 150 మోటర్లు కాలిపోయినట్టు తెలిపారు. విద్యుత్తు అధికారులు నష్టపరిహారం చెల్లించడంతోపాటు లోవోల్టేజీ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
తాంసి, ఆగస్టు 16 : కరెంట్ కోతలపై ప్రశ్నిస్తే కేసులు పెడుతామని బెదిరిస్తున్న అధికారుల తీరును నిరసిస్తూ రైతులు ఆదిలాబాద్ జిల్లా తాంసి సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. ‘మండల విద్యుత్తు అధికారితోపాటు సీనియర్ లైన్మెన్.. మాకొద్దు’ అంటూ నినదించారు. నెల రోజులుగా తరచూ విద్యుత్ సరఫరాలో అంతరాయంతో ఇబ్బంది పడుతున్నామని తెలిపారు. గురువారం రాత్రి విద్యుత్తు సరఫరాలో అంతరాయంపై జామిడి గ్రామస్థులు విన్నవించగా మద్యం తాగి వచ్చి గొడవ చేస్తున్నారని కేసు పెడుతామని సబ్ స్టేషన్ అధికారులు బెదిరించారని వారు వాపోయారు. శుక్రవారం కూడా కరెంట్ లేకపోవడంతో అధికారుల తీరుకు నిరసనగా సబ్ స్టేషన్‌ను ముట్టడించారు.