నల్లగొండ, జూన్ 17: కాలానుగుణంగా దొడ్డు ధాన్యం నుంచి సన్న ధాన్యం సాగుకు రైతులు ఆసక్తి చూపుతున్నందున ప్రైవేటు కంపెనీలు సైతం సన్నాల్లో మేలురకమైన విత్తనాలు మార్కెట్లో ప్రవేశపెడుతున్నాయి. కాలపరిమితి తగ్గించడంతోపాటు చీడ, పీడల ప్రభావం లేకుండా చర్యలు చేపడుతున్నందున రైతులు సైతం దొడ్డు వడ్లకు స్వస్తి పలుకుతూ సన్నాల వైపు దృష్టిసారిస్తున్నారు. అందులో భాగంగానే గత వానాకాలం సీజన్లో రాష్ట్రంలో 60.50 లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా అందులో 32 లక్షల ఎకరాల్లో సన్న ధాన్యం పండించినట్టు వ్యవసాయ శాఖ చెప్తుంది. ప్రధానంగా ప్రభుత్వ వెరైటీలైన బీపీటీ 5204, స్వర్ణమసూరి, తెలంగాణ సోనా లాంటి విత్తనాలతోపాటు జీనెక్స్ సీడ్స్‌కు చెందిన చిట్టిపొట్టి, కల్కి విత్తనాలు పెద్ద ఎత్తున రైతులు సాగుచేసినట్టు వ్యవసాయ శాఖ నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ విత్తనాలు మంచి దిగుబడి రావడంతోపాటు బహిరంగ మార్కెట్లో డిమాండ్ ఎక్కువగా ఉండటంతోనే రైతులు అటుగా దృష్టిసారించి సాగుచేస్తున్నట్టు తెలుస్తున్నది.
సన్నాల వినియోగం పెరుగుతున్నందున వాటి సాగుపై రైతులు దృష్టిసారిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అనేక కంపెనీలు చక్కని బ్రీడింగ్‌తో మేలురకమైన వంగడాలను మార్కెట్లో ప్రవేశపెడుతున్నారు. ప్రధానంగా జీనెక్స్ సీడ్స్ అనే విత్తన కంపెనీ మార్కెట్లోకి తీసుకొచ్చిన చిట్టి పొట్టి, కల్కి విత్తనాల సాగుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. సీజన్‌తో సం బంధం లేకుండా వానాకాలంతోపాటు వేసవిలోనూ ఈ విత్తనాలు మంచి దిగుబడి ఇవ్వటంతో ఏటా సాగు విస్తీర్ణం పెరుగుతున్నది. 120నుంచి 125 రోజుల్లో పంట చేతికి వస్తున్న చిట్టిపొట్టి ఎకరాకు 45 నుంచి 50 బస్తాలు, కల్కి 55 నుంచి 60 బస్తాల వరకు దిగుబడి రావటంతోపాటు పచ్చి ధాన్యానికి క్వింటాకు రూ.2,400 నుంచి రూ.2,600, ఎండిన ధాన్యానికి రూ.3,300 నుంచి రూ.3,600 వరకు మార్కెట్లో ధర పలుకుతున్నట్టు రైతులు చెప్తున్నారు. అంతేగాక ఈ బియ్యానికి ఇతర రాష్ర్టాలు మంచి డిమాండ్ ఉండటంతో మిల్లర్లు సైతం ఇతర వెరైటీల ధాన్యం కంటే ఎక్కువ ధర పెట్టి వీటిని కొనడం విశేషం. దీంతో రైతులు దీనిని సాగు చేయటానికి ఆసక్తి చూపుతున్నారు.
నేను పది ఎకరాల్లో జీనెక్స్ కంపెనీకి చెందిన చిట్టిపొట్టి సాగు చేస్తే ఎకరాకు 46 బస్తాల చొప్పున ధాన్యం పండింది. దీనికి క్వింటాకు రూ.2,600 దాకా మిల్లర్లు కొన్నారు. కల్కి కూడా పది ఎకరాలు సాగు చేస్తే ఎకరాకు 56 బస్తాల వరకు పండింది. దీన్ని ఎండిన తర్వాత అమ్మితే క్వింటాకు రూ.3,600 వచ్చింది. నేను నాలుగేండ్లుగా ఈ విత్తనాలే సాగు చేస్తుండగా దిగుబడులు బాగా వచ్చి.. మంచి ధర పలుకుతున్నది.
చిట్టిపొట్టితో మంచి దిగుబడి వస్తుంది
చిట్టిపొట్టి విత్తనాలతోపాటు కల్కి విత్తనాలు ప్రతి సీజన్లోనూ మంచి దిగుబడి వస్తుంది. ఈ విత్తనాలు ఎలాంటి వాతావరణ పరిస్థితులనైనా తట్టుకోవడంతోపాటు దిగుబడి రావటం వల్ల రైతులు ఆసక్తి చూపుతున్నారు. బహిరంగ మార్కెట్లో క్వింటా పచ్చి వడ్లకు రూ. 2,500 వరకు ధర వస్తుండగా ఎండిన ధాన్యానికి మరో వెయ్యి అదనంగా వస్తుంది.