పెద్దవూర, సెప్టెంబర్ 23: యూరియా కోసం క్యూలో నిల్చున్న రైతుపై హోంగార్డు చేయిచేసుకోవడం కలకలం సృష్టించింది. ఈ క్రమంలోనే క్యూలైన్లో తొక్కిసలాట జరగ్గా మరో ముగ్గురు మహిళా రైతులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన నల్లగొండ జిల్లా పెద్దవూర మండల కేంద్రంలోని ప్రాథమిక సహకార సంఘం వద్ద మంగళవారం చోటుచేసుకున్నది.
యూరియా ఇస్తున్నారన్న సమాచారంతో సమీప గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున తెల్లవారుజామునే పెద్దవూర పీఏసీఎస్‌కు చేరుకుని క్యూకట్టారు. లైన్లో నిల్చొని ఇబ్బందులు పడుతున్న చలకుర్తికి చెందిన రైతు ఇస్రాజు శ్రీనుపై హోంగార్డు ఉషానాయక్ చేయిచేసుకోవడం విస్మయాన్ని కలిగించింది. ఇదే సందర్భంలో క్యూలైన్లో తొక్కిసలాట జరగడంతో మరో ముగ్గురు మహిళలు సొమ్మసిల్లి పడిపోయారు. హోంగార్డు దాడి చేస్తున్నట్టు ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.