Rangareddy | రంగారెడ్డి, సెప్టెంబర్ 19(నమస్తే తెలంగాణ)/ తుర్కయంజాల్: నిన్నమొన్నటి వరకు ఆదరువుగా ఉన్న ఆ నీటివనరే ఇప్పుడు కొందరి నిర్వాకం మూలంగా అక్కడి రైతుల పాలిట శాపంగా పరిణమించబోతున్నది. ఓచోట కట్టాల్సిన అలుగును మరోచోట కట్టడం వల్ల జీవనాధారమైన తమ పొలాలు నీట మునుగుతాయని బాధిత రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. కుంటలో నీటిని దారి మళ్లించడం వెనుక మతలబేంటని? స్థానిక రైతులు ప్రశ్నిస్తున్నారు. కుంట ఎగువ ప్రాంతంలో ఉన్న స్థానిక ఎమ్మెల్యే అల్లుళ్లకు సంబంధించిన పొలాలను ఎఫ్టీఎల్ పరిధి నుంచి తప్పించేందుకే చోటు మార్చి అలుగు నిర్మిస్తున్నారని ఆరోపిస్తున్నారు. విల్లాల నిర్మాణం కోసం తమ జీవితాలను పణంగా పెడుతున్నారని, అలుగు నిర్మాణం పూర్తయితే తమ పొలాలు ముంపునకు గురై జీవనాధారం కోల్పోతామని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లాపూర్‌మెట్ మండలం తొర్రూరులో ఎర్రకుంటలోని నీరు దిగువకు వెళ్లేలా తొర్రూరు-బ్రాహ్మణపల్లి రహదారిని ఆనుకుని ప్రస్తుతం అలుగు నిర్మాణం చేపడుతున్నారు. నీటిపారుదల శాఖ ప్రతిపాదించిన మేరకు ఆర్అండ్బీ శాఖ పనులు చేపడుతున్నది. సుమారు రూ.20 లక్షలతో చేపట్టిన ఈ పనులకు సంబంధించిన అంచనాలకు ఈ ఏడాది ఫిబ్రవరిలో మంజూరు కల్పించగా పనులు దక్కించుకున్న సంస్థ ఆగస్టులో ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలిసింది. ఇటీవలే పనులు మొదలు కాగా ఒప్పందం ప్రకారం 1000 ఎంఎం డయా సామర్థ్యం గల పైపులైన్ వేయాల్సి ఉన్నది. కానీ, స్థానిక రైతులు నిరసన తెలుపడంతో పైపులైన్ బదులు అలుగు నిర్మాణం చేపట్టాలని నిర్ణయించినట్టు తెలిసింది. కుంటకు గతంలో ఉన్న అలుగు ప్రాంతంలో కొత్తది నిర్మించకుండా వేరే ప్రాంతంలో చేపట్టడమే వివాదానికి కారణమైంది. ప్రస్తుతం నిర్మిస్తున్న అలుగుతో కుంటలోకి వరద కారణంగా 150 ఎకరాలు నీట మునుగుతాయని బాధిత రైతులు పేర్కొంటున్నారు. పనులు ఆపేయాలని కోరుతూ అలుగు నిర్మాణ ప్రాంతం వద్దనే టెంట్ వేసుకొని ఆరు రోజులుగా తమ కుటుంబాలతో నిరసన తెలుపుతున్నా పోలీసు బందోబస్తుతో చేయిస్తున్నారని వాపోయారు.
ఎర్రకుంటకు ఎగువన వ్యవసాయ భూములు చాలావరకు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయి. ఎఫ్టీఎల్ పరిధి తగ్గించి ఆయా భూములకు ముంపు ముప్పు తప్పించేందుకే కొత్తచోట అలుగు నిర్మిస్తున్నారని రైతులు విమర్శిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే అల్లుళ్లకు సంబంధించిన పొలాలు ఉన్నాయని, భవిష్యత్తులో ఆ భూముల్లో విల్లాలు నిర్మించే ఆలోచనలో సదరు వ్యక్తులు ఉన్నారని చెప్తున్నారు. అలుగు నిర్మాణం పూర్తయితే తమ పొలాలు మునుగుతాయని, ఇక చావే శరణ్యమని ఆవేదన చెందుతున్నారు. నిరసన తెలుపుతున్న తమకు ఎమ్మెల్యే అల్లుళ్ల నుంచి ప్రాణహాని ఉన్నదని బాధిత రైతుల్లో ఒకరైన రాజ్ కిరణ్ మీడియా ఎదుట ఆందోళన వ్యక్తంచేశారు. కాగా రైతుల వాదనను ఎమ్మెల్యే అల్లుడు నరేందర్‌రెడ్డి విభేదించారు. వాస్తవాలు తెలుసుకోకుండా ఆరోపణలు చేయడం సరికాదన్నారు. అలుగు వివాదంపై వివరణ కోసం నీటిపారుదల శాఖ అధికారులకు ఫోన్‌చేయగా స్పందించ లేదు. ఈ వివాదంపై హైడ్రా కమిషనర్‌కు, కలెక్టర్‌కు ఫిర్యాదు చేయనున్నట్టు బాధిత
రైతులు చెప్పారు.