చింతకాని, జూలై 9 : రైతుమేళా నిర్వహిస్తున్నాం.. రైతులంతా తరలిరావాలని పిలుపునిచ్చిన పెద్దలు.. వచ్చిన రైతులకు కనీస సౌకర్యాలు కల్పించలేకపోయిన ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకున్నది. చింతకాని మండలం జగన్నాథపురం-మక్కేపల్లి క్రాస్‌రోడ్డు వద్ద గురువారం రైతుమేళాను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంచారు.
3 వేల మంది రైతులు హాజరుకాగా .. మధ్యాహ్న భోజనం, తాగునీటి వంటి సౌకర్యాలు కల్పించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ‘రైతుమేళా పేరుతో మమ్మల్ని తీసుకొచ్చి కడుపునిండ భోజనం, తాగునీటి ఏర్పాట్లు చేయలేకపోయారు.. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే.. రేపటి రైతు ఆశీర్వాద సభ ఎలా నిర్వహిస్తారు?’ అంటూ రైతులు ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రభుత్వం, అధికార యంత్రాంగం మధ్య సమన్వయలోపంతో ఇబ్బందులు ఎదురోవాల్సి వస్తున్నదని రైతులు వాపోయారు.