రేగొండ, మార్చి 2 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రానికి చెందిన బిల్లా కనుకారెడ్డి రెండు ఎకరాల్లో వరి వేసి రెండు నెలలు కావొస్తున్నా కాల్వల సాగునీరు విడుదల కాకపోవడం, భూగర్భ జలాలు అడుగంటి బావిలో నీరు లేకపోవడంతో పంట ఎండిపోయింది. నీళ్లొచ్చే పరిస్థితి లేక శనివారం ఆయనే స్వయంగా వరి చేనులో పశువులను మేపాడు. బీఆర్ఎస్ పాలనలో ఏడాది పొడవునా సాగునీరు విడుదల చేయడంతో ఏటా రెండు పంటలు సాగు చేసే కనుకారెడ్డి, అదే ఆశతో తనకున్న నాలుగు ఎకరాల్లో రెండు ఎకరాలు మాత్రమే వరి వేసి, మిగిలిన రెండు ఎకరాలను వదిలేశాడు. సాగు చేసిన రెండు ఎకరాల వరి పంటకు ఇప్పటి వరకు బావిలోని నీటిని అందిస్తూ కాపాడుకున్నాడు. కాల్వల ద్వారా నీళ్లొస్తాయనే కొండంత ఆశతో ఎదురు చూస్తూ ఇప్పటి వరకు పంటను కాపాడుకుంటూ వచ్చాడు. తీరా కాల్వలు పారక, బావిలో నీళ్లు అడుగంటడంతో చేతికి ఆందే దశలో ఉన్న వరిపొలం నెర్రెలు బారి ఎండిపోవడంతో ఆందోళన చెందిన కనుకారెడ్డి పశువుల మేతకు వదిలాడు.