ఆమనగల్లు, సెప్టెంబర్ 22: గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపాదించిన అలైన్మెంట్ ప్రకారమే ట్రిపుల్ ఆర్ నిర్మించాలని రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి టీ సాగర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు పట్టణంలోని ఓ గార్డెన్లో సోమవారం ఆమనగల్లు, తలకొండపల్లి, మాడుగుల మండలాల్లో రీజినల్ రింగ్ రోడ్డు భూనిర్వాసితుల అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా సాగర్ మాట్లాడుతూ.. పెద్దల భూములు కాపాడటం కోసం, రియల్ ఎస్టేట్ వ్యాపారుల లబ్ధికోసం కాంగ్రెస్ ప్రభుత్వం అలైన్మెంట్ మార్చడం సరికాదన్నారు. రింగ్ రోడ్డు అంటే రింగులాగా ఉండాలి కాని వంకర, వంకరలుగా ఎందుకు మారిందో రేవంత్రెడ్డి బహిరంగంగా చెప్పాలని డిమాండ్ చేశారు.
వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి నాగయ్య మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు రక్షణగా ఉండకుండా పెట్టుబడిదారులకు మద్దతుగా నిలబడటం సిగ్గుచేటని అన్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు జంగారెడ్డి మాట్లాడుతూ.. రైతులంతా ఐక్యంగా ఉంటూ ప్రభుత్వంపై పోరాడాలని పిలుపునిచ్చారు.