నర్సాపూర్: వడగండ్ల వానతో (Hailstorm) నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ. 25 వేలు నష్టపరిహారం చెల్లించాలని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి (MLA Sunitha Laxmareddy) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి , గిరిజన తండాలలో వనగండ్ల వానతో నష్టపోయిన వరి పంటను శుక్రవారంపరిశీలించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శివంపేట్, నర్సాపూర్ మండలాల్లో వనగండ్ల వానతో రైతులకు అపార నష్టం కలిగిందని అన్నారు. వనగండ్ల వానతో రైతులు ఎకరాకు సుమారు రూ. 30 వేలు నష్టపోయారని అన్నారు. వ్యవసాయ అధికారులు రైతుల వివరాలను తెలుసుకొని ప్రభుత్వానికి నివేదించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నష్టపోయిన పంటలకు బీమా ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. పంటలతోపాటు వనగండ్ల వానకు కరెంట్ స్తంభాలు, రేకుల షెడ్లు నష్టపోయిన బాధితులను ఆదుకోవాలని కోరారు.
బీఆర్ఎస్ పార్టీ రైతులకు అండగా ఉంటుందని భరోసానిచ్చారు. ప్రభుత్వం నుంచి నష్టపరిహారం ఇప్పించేందుకు కృషి చేస్తానని తెలిపారు. రైతులు అధైర్య పడకుండా ధైర్యంగా ఉండాలని భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో జడ్పీ కో ఆప్షన్ మాజీ మెంబర్ మన్సూర్, మండల అధ్యక్షుడు చంద్రశేఖర్, రాష్ట్ర నాయకులు సత్యం గౌడ్, బీఆర్ఎస్ నాయకులు వంజరి శ్రీనివాస్, శ్రీనివాస్ గౌడ్, కొండల్, నర్సింగ్ పాల్గొన్నారు.