కొమురవెల్లి, అక్టోబర్ 24 : వ్యవసాయానికి తీసుకున్న అప్పులు తీరక పోవడంతోపాటు పంట రుణం మాఫీ కాకపోవడంతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకున్నది. కొమురవెల్లి మండలం మర్రిముచ్చాలకు చెందిన రైతు వంగ మహేందర్‌రెడ్డి(56) ఏడాది క్రితం కొమురవెల్లిలోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకులో 1.80 లక్షల పంట రుణం తీసుకున్నాడు. అది కాస్త వడ్డీతో 2 లక్షల వెయ్యి రూపాయలకు చేరింది. మూడు విడతల్లో ప్రభుత్వం విడుదల చేసిన రుణమాఫీ జాబితాలో తన పేరు లేకపోవడంతో మహేందర్‌రెడ్డి బ్యాంకు, వ్యవసాయ అధికారుల చుట్టూ తిరిగాడు. రూ.2 లక్షలకు మరో వెయ్యి రూపాయలు ఎక్కువగా ఉందని, ప్రభుత్వం రుణమాఫీ చేసినప్పుడు అవుతుందని వ్యవసాయ అధికారులు సమాధానమిచ్చారు. దీంతో కొన్ని రోజులుగా దిగులుగా ఉన్న రైతు మహేందర్‌రెడ్డి గ్రామం లో ఎవరు కలిసినా తనకు రుణమాఫీ కాలేదని ఆవేదన చెందేవాడు. ఈ ఏడాది వ్యవసాయం కూడా కలిసిరాలేదు. తనకున్న 4 ఎకరాల్లో వేసిన వరి పంట ఇటీవల కురిసిన వర్షంతో దెబ్బతిన్నది. ఇటు రుణమాఫీ కాక, అటు ఎవుసం కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలో అనే బెంగతో గురువారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చే సుకున్నాడు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతుడి కుమారుడు శ్రీనివాస్‌రెడ్డి ఫిర్యాదు మేరకు కొమురవెల్లి ఎస్సై రాజుగౌడ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాడు. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి మృతుడి కుటుంబాన్ని ఫోన్లో పరామర్శించి ధైర్యం చెప్పారు.