నాగారం, ఏప్రిల్ 6 : ‘అసమర్థ కాంగ్రెస్ పాలనలో రైతుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. ఇది ప్రకృతి వైపరీత్యం కాదు.. మనుషుల వైపరీత్యం. ఇచ్చిన హామీలు అమలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గ్రామాల్లో నిలదీయాలి’ అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా నాగారం మండలం ఫణిగిరిలో శనివారం ఏర్పాటు చేసిన భువనగిరి పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు.
మండుటెండను సైతం ఖాతరు చేయకుండా రైతుల కష్టాలు తెలుసుకునేందుకు కేసీఆర్ వస్తుంటే.. పట్టించుకోకుండా క్రికెట్ మ్యాచ్‌లతో పాలకులు ఎంజాయ్ చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎన్నికల హామీలైన రూ.2 లక్షల రుణమాఫీ, రూ.500 బోనస్ ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. సమావేశంలో జడ్పీ చైర్పర్సన్లు గుజ్జ దీపిక, సందీప్‌రెడ్డి, భువనగిరి అభ్యర్థి క్యామ మల్లేశ్‌యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిశోర్, భిక్షమయ్యగౌడ్, నాయకులు రామకృష్ణారెడ్డి, నర్సింహారెడ్డి, రజాక్ పాల్గొన్నారు.