మునుగోడు, అక్టోబర్5 : వారంలో అన్ని రోజులతో పాటు కనీసం ఆదివారం రోజైనా ఉచిత విద్యుత్ సక్రమంగా వస్తుందేమో.. ఎండిపోతున్న కంటిపాపలాంటి వరి చేనుకు నీళ్లు పారుతాయేమో అని ఆశపడ్డ ఆ రైతుకు కాంగ్రెస్ పాలన కన్నీళ్లే మిగిల్చింది. ప్రభుత్వం తెచ్చిన అస్తవ్యస్త విద్యుత్ కోతలు, నిర్లక్ష్య వైఖరి మునుగోడు మండలంలో ఒక నిండు ప్రాణాన్ని పొట్టనబెట్టుకున్నాయి. నల్గొండ జిల్లా మునుగోడు మండలం ఎల్లలగూడెం గ్రామానికి చెందిన రైతు తిరిపారి సత్యం (41) ఆదివారం మధ్యాహ్నం తన వరి పొలానికి వెళ్లాడు. వరి చేనును పరిశీలిస్తుండగా పాము కాటేసింది.
గమనించిన కుటుంబ సభ్యులు దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. సత్యం మృతితో ఆయన భార్య, ఇద్దరు కుమారులు దిక్కులేని వారయ్యారు. కాగా, వేళాపాళా లేని విద్యుత్ సరఫరా వల్ల రైతులు రాత్రి అనక, పగలనక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పొలాల వద్ద కాపలా కాయాల్సిన దుస్థితి దాపురించింది. సక్రమమైన వేళల్లో విద్యుత్ ఇచ్చి ఉంటే సత్యం ఈ రకంగా మధ్యాహ్నం వేళ పొలాల వెంట తిరగాల్సిన అవసరం వచ్చేది కాదని, ఈ మరణానికి ప్రభుత్వ అసమర్థతే కారణమని స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే మృతుడి కుటుంబానికి పరిపరిహారం అందించాలని, వ్యవసాయానికి నాణ్యమైన కరెంట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.