పాలమూరు, మార్చి 6 : ‘సారూ.. మా బతుకులు ఆగమైపోతున్నాయ్.. రుణమాఫీ కాలె.. రైతుబంధు పడలే.. కరెంట్ సక్కగా లేదు. బోర్లలో నీళ్లు లేక పంటలు చేతికి అందుతలే.. నాలుగున్నర ఎకరాల్లో వరి ఎండిపోయింది.. పంటను కాపాడుకొనేందుకు బోరు వేస్తున్నా.. 300 ఫీట్లు దాటినా చుక్క నీరు రాలే.. ’ అని మహబూబ్‌నగర్ జిల్లా దమ్మాయిపల్లి రైతు బాలయ్య ఆవేదన వ్యక్తంచేశాడు. గురువారం మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ కోయిలకొండ మండలం మల్కాపూర్ నుంచి మహబూబ్‌నగర్‌కు వస్తుండగా.. దమ్మాయిపల్లి శివారులో బోరు డ్రిల్లింగ్ చేయిస్తున్న రైతు బాలయ్యకు వద్దకు వెళ్లి పలుకరించారు.
మాజీ మంత్రిని చూసిన రైతు తన గోడు వెల్లబోసుకున్నాడు. ‘మీరు ఏదైనా చేయండి సార్.. అంటూ వేడుకున్నాడు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. ‘మా చేతిలో ఏముంది? మీరే వినకపోతిరి.. మార్పు మార్పు అంటూ కాంగ్రెస్‌ను గెలిపిస్తే మళ్లీ పాత రోజులు వస్తాయని ముందే చెప్పినం.. ఇప్పుడు అదే మాట నిజమైంది’ అని అన్నారు. ఎన్నికల సమయంలో రుణమాఫీ చేస్తాం.. రైతుబంధు వేస్తాం.. పింఛన్ పెంచుతాం.. ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం.. మహిళలకు నగదు ఇస్తాం.. అంటూ హామీలు గుప్పించి మోసం చేసి గెలిచాక వారి నిజస్వరూపం బట్టబయలైందని అన్నారు.
మళ్లీ మోటర్లు కాలిపోతున్నాయి, కేసీఆర్ ప్రభుత్వంలో ఒక్క మోటరు కాలకుండా రైతులకు సాగునీరు అందించి, ఎకరా పొలం ఎండకుండా రైతులను కంటికి రెప్పలా కాపాడుకున్నామని గుర్తుచేశారు. నదుల నీటిని ఒడిసిపట్టి రిజర్వాయర్లు, చెరువులను నింపామని, అదంతా కేసీఆర్ ఘనతేనని కొనియాడారు. మహబూబ్‌నగర్ జిల్లాలో ఎక్కడ చూసినా పంటలన్నీ ఎండిపోతున్నాయని ఆవేదన చెందారు. నష్టపోయిన పంటలకు ప్రభుత్వం ఎకరాకు రూ.25 వేల పరిహారం చెల్లించాలని, వేసుకున్న బోర్లకు ప్రభుత్వమే బిల్లులు ఇవ్వాలని, 24 గంటలపాటు కరెంటు ఉచితంగా అందజేయాలని, రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాల్లో వేయాలని డిమాండ్ చేశారు.