సిరిసిల్ల రూరల్, ఫిబ్రవరి 26: అసైన్డ్ భూమి పట్టా చేసుకుంటున్నారన్న అధికారుల అభియోగాలతో అరెస్టయిన సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్లకు చెందిన రైతు అబ్బాడి రాజిరెడ్డి బెయిల్‌పై విడుదలయ్యారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రత్యేక చొరవతో న్యాయపోరాటం చేసిన రైతు ఐదు రోజులు తర్వాత బుధవారం శివరాత్రి పండుగ పూట ఇంటికి చేరుకున్నాడు. వివరాల్లోకి వెళితే రాజన్న సిరిసిల్ల జిల్లా జిల్లెల్ల గ్రామానికి చెందిన అబ్బాడి నారాయణరెడ్డి, బాలవ్వ దంపతులకు అదే గ్రామంలో సర్వే నంబర్ 1173/1లో మూడెకరాలు పట్టాభూమి ఉంది.
ఈ క్రమంలో తమ పొలానికి ఆనుకుని ఉన్న 30 గుంటల భూమి (సర్వేనంబర్ 1183/4/1/1)ని రైతు దంతె మల్లయ్య వద్ద 50 ఏండ్ల క్రితం కొనుగోలు చేశారు. పట్టా చేసుకోకుండానే సాగు చేసుకుంటూ వచ్చారు. కొన్నేండ్ల అనారోగ్యంతో నారాయణరెడ్డి, బాలవ్వ దంపతులు మృతి చెందగా, వారి కొడుకు అబ్బాడి రాజిరెడ్డి వారసత్వంగా వచ్చిన భూమిని సాగు చేసుకుంటున్నాడు. తల్లిదండ్రులు కొనుగోలు చేసిన 30 గుంటలకు 2017లో పీవోటీ, సాదాబైనామా చట్టం కింద రెవెన్యూ అధికారులే పట్టాపాసుబుక్ ఇచ్చారు.
ఇటీవల జిల్లా యంత్రాంగం సిరిసిల్లలో బీఆర్ఎస్ కార్యకర్తలపై కక్ష గట్టిందని ఆరోపణలున్నాయి. అందులో భాగంగానే రాజిరెడ్డి గ్రామానికే చెందిన అబ్బాడి అనిల్ అసైన్డ్ భూమిని అక్రమంగా పట్టా చేసుకున్నాడంటూ కొందరి ఫిర్యాదు చేయగా, అబ్బాడి ఇంటిపేరుతో ఉన్న రాజిరెడ్డిని ఈ నెల 20న పోలీసులు అరెస్ట్ చేశారు. గొం తుకు వారం కిందటే ఆపరేషన్‌తో మా ట్లాడలేని స్థితిలో ఉన్నప్పటికీ కనికరం లేకుండా అరెస్ట్‌చేసి రిమాండ్ తరలించారు. ఈ అన్యాయంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఆయన ప్రత్యేక చొరవతో రైతు రాజిరెడ్డి న్యాయపోరాటం చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం బెయిల్ మంజూరవగా బుధవారం ఇంటికి చేరుకున్నాడు.