Fancy Numbers | హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ) : ఆర్టీఏ ఫ్యాన్సీ నంబర్లలో కొందరు రవాణాశాఖ అధికారులు కొత్త పద్ధతుల్లో కుం భకోణాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆర్టీఏకు రూ.లక్షల ఆదా యం సమకూర్చే ఫ్యాన్సీ నంబర్లలో చేతివాట ప్రదర్శిస్తూ జేబులు నింపుకుంటున్నట్టు సమాచారం. దీనిపై రవాణాశాఖలో రహస్యం గా విచారణ జరుగుతున్నట్టు తెలుస్తున్నది.
ఫ్యాన్సీ నంబర్ల ధరలను ఆన్లైన్లో తక్కువ చేసి, చూపించడం వెనుక కొందరు అధికారులు ఉన్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకే వ్యక్తితో ఎక్కువ మెయిల్స్ ద్వారా బిడ్డింగ్లు వేయిస్తూ అనుకున్న ధర కోట్ చేసిన తర్వాత సాంకేతిక సమస్యలు ఏర్పడేలా చేస్తున్నారని తెలుస్తున్నది. వేరేవాళ్లు వేలంలో పాల్గొనకుండా, ఎక్కువ ధర పలకకుండా అక్రమాలకు పాల్పడుతున్నట్టు సమాచారం.
నిరుడు అక్టోబర్లో రవాణాశాఖలో కొందరు అధికారులు, ఏజెన్సీ సిబ్బంది ఫ్యాన్సీ నంబర్ల కుంభకోణానికి పాల్పడ్డట్టు తేలింది. వేలం ప్రక్రియలోని వివరాలను కావాల్సిన వారికి లీక్ చేశారని స్పష్టమైంది. కానీ వారిపై ఉన్నతాధికారులు నామమాత్రపు చర్యలతో సరిపెట్టారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆర్టీఏలో ఫ్యాన్సీ నంబర్ల కుంభకోణాలు ఇంతగా జరుగుతున్నా… ఉన్నతాధికారులు తూతూమంత్రం చర్యలతో సరిపెట్టడంలో ఆంతర్యంఏమిటి? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.