రాష్ట్రంలో ఎల్ నినో పరిస్థితుల నేపథ్యంలో కరువు తాండవిస్తున్నది. గతంలో కాళేశ్వర జలాలతో భూమికి పచ్చని రంగేసినట్టు తయారైన గ్రామాలు నేడు బీడుగా మారడంతో ప్రజానీకం దిగాలు పడుతున్నది. ప్రాజెక్టుల్లో ఉన్న కొద్దిపాటి నీటిని ఒడిసి పట్టాల్సిన తరుణంలో సర్కార్ నిర్లక్ష్యం రైతన్నకు శాపంగా మారింది. మరోవైపు భూగర్భజలాలు అడుగంటడంతో బోర్ల నుంచి నీటి చుక్కరాక రైతాంగం ఆందోళన చెందుతున్నది. వేసిన నారుమడులను బతికించుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా రైతాంగం కన్నీటిగోసపై ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం..(నూర శ్రీనివాస్)
వరంగల్, జూలై 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం పడమటిగూడెనికి చెందిన రైతు చిదిమిళ్ల భిక్షం తనకున్న ఎకరం 10 గుంటల్లో జూన్‌లో 5 బోర్లు వేసిండు. ఈ నెల మరో 6.. ఇలా నెలన్నర కాలంలో 11 బోర్లు వేసినా చుక్కనీరు కండ్ల చూడలే. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం సర్వాయిపేటకు చెందిన రైతు మనోజ్ రెండెకరాల భూమిలో రూ.6 లక్షలు ఖర్చుపెట్టి మూడు బోర్లు వేసిండు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలానికి చెందిన రైతు పరుపాటి మధుసూదన్‌రెడ్డి కి మైలారం రిజర్వాయర్ కింద తనకున్న రెండు బోర్లు ఎండిపోయాయి. ఇప్పుడు మరో బోర్ వేసిండు. మోటర్ పెట్టి ఆన్‌చేస్తే నీళ్లు రావడం లేదు. రాష్ట్రంలోని రైతులందరిదీ ఈ ముగ్గురు రైతుల అనుభవమే. కోటి ఎకరాల మాగాణంగా మలుచుకున్న తెలంగాణ ఒక్క సీజన్లో వానపడకపోతే ఇంత గోసపడుతున్నదా? స్వపరిపాలనలో భూమి మోయలేని పంటను పండించిన తెలంగాణ రెండునెలలు వానలు రాకపోతే దూపకేడువాల్సిందేనా? రాజకీయ కక్షలో మునిగిపోయిన రాష్ట్ర సర్కార్ రైతుల మీద పగతీర్చుకుంటున్నదా?.. అంటే.. జరుగుతున్న పరిణామాలు అవుననే అంటున్నాయి. తెలంగాణలో ఆవహించిన కరువుగత్తరలో రైతన్నలు భిక్కుభిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్న దయనీయ పరిస్థితి నెలకొన్నది.
రాష్ట్రం తీవ్ర వర్షాభావం
రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 33 శాతానికి పైగా లోటువర్షపాతమే నమోదయ్యింది. 92.08 శాతం సాగుభూమి బీడువారింది. 12,760 గ్రామాలకుగాను 11,479 గ్రామాల్లో వర్షాభావం నెలకొన్నది. 892 గ్రామాల్లో అత్యంత తీవ్రంగా<, 7,939 గ్రామాల్లో తీవ్రంగా, 2,998 గ్రామాల్లో ఓ మోస్తరుగా ఎల్ నినో ప్రభావం ఉన్నది. రాష్ట్రంలో 1,32,38,446 ఎకరాలకుగాను 59,83,971 ఎకరాల్లో (45.20శాతం) ఆరుతడి పంటల కోసం విత్తనాలు, వరి నారుపోశారు. దాదాపు జూలై చివరికి వచ్చినా ఇంకా 72,54, 475 (54.80 శాతం) ఎకరాలు చదునై సిద్ధంగా ఉన్నది.
భూతల్లి జలశోకం
రాష్ట్ర సగటు భూగర్భ జలాల లోతు 9.36 ఎంబీజీఎల్ (మీటర్ బిలో గ్రౌండ్ వాటర్‌లెవల్)గా నమోదయ్యింది. ఇందులో 13 జిల్లాల్లో రాష్ట్ర సగటు కన్నా భూగర్భజలం గణనీయంగా పాతాళానికి పడిపోయింది. వికారాబాద్ (13.79 ఎంబీజీఎల్), మెదక్ 13.64, కామారెడ్డి13.11, సంగారెడ్డి 12.84, జయశంకర్-భూపాలపల్లి 12.45, సిద్దిపేట 11.94, రంగారెడ్డి 11.78, మేడ్చల్-మల్కాజ్గిరి 11.58, సిరిసిల్ల 11.65, నిజామాబాద్ 11.55, మహబూబ్‌నగర్ 10.54, ఆదిలాబాద్ 10.03, నిర్మల్ 9.56 ఎంబీజీఎల్)లో భూగర్భజల మట్టాలు పడిపోయాయి.
నాడు మత్తళ్లు దుంకి.. నేడు జలకళ తప్పి
చిన్ననీటి వనరులే పెద్దదిక్కుగా ఉన్న తెలంగాణలో పడావుపడ్డ చెరువులను బాగుచేసుకోవటానికి కేసీఆర్ హయాంలో మిషన్ కాకతీయ పథకాన్ని విజయవంతంగా అమలు చేసింది. 2014 నుంచి 2023 దాకా రాష్ట్రంలోని 46,531 చెరువులకు గాను నాలుగు దశల్లో 27,627 చెరువులు పునరుద్ధరణకు నోచుకున్నాయి. ఫలితంగా ఆ చెరువుల్లో 265 టీఎంసీల నీరు నిల్వ అయింది. 2.88 లక్షల ఎకరాలకు పైగా ఆయకట్టు స్థిరీకరణ జరిగి అంతకుముందున్న 6.9 శాతం ఉన్న భూగర్భ జలమట్టాలు 9.2 శాతానికి పెరిగాయి. రాష్ట్ర భూగర్భ జలశాఖ నివేదికల ప్రకారం ఇప్పుడూ భూగర్భ జలాలు రాష్ట్ర సగటు తిరిగి అదే స్థాయికి పడిపోవటం ఆందోళనకరం.
రాష్ట్రంలో ఇదీ చెరువుల చరిత్ర
1875లో 41వేల హెక్టార్లు చెరువుల కిందసాగుకాగా, 1940 నాటికి ఆ విస్తీర్ణం 3 లక్షల 73వేల హెక్టార్లకు పెరిగింది. ఏపీ అవతరణ నాటికి 5లక్షల 30వేల హెక్టార్లకు చేరింది. కొత్త చెరువుల తవ్వకం, ఉన్న చెరువుల సమర్థ నిర్వహణ జరిగింది. 2009 నాటికి అది 2.53 లక్షల హెక్టార్లకు పడిపోయింది.
కరువు తీర్చిన కాళేశ్వరం
కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని 13 జిల్లాల్లో 13,32,678 బోర్‌వెల్స్ ఉన్నాయి. తెలంగాణలో విద్యుత్ ఆధారిత వ్యవసాయ పంప్సెట్లలో ఇవి సగం. కాళేశ్వరంలో భాగమైన రిజర్వాయర్లు, కాలువలు, వాటి పరిధిలోని చెరువులు నింపడం ద్వారా ఆ 13 జిల్లాల పరిధిలోని భూగర్భజల మట్టాలు గణనీయంగా పెరిగాయని, బోర్‌వెల్స్‌కు నీరు సమృద్ధిగా లభించినట్టు భూగర్భ జలశాఖ 2022 విడుదల చేసిన నివేదికలు స్పష్టం చేశాయి. వాటి ఆధారంగా 13 జిల్లాల్లోని రైతులు 122 టీఎంసీల భూగర్భ నీటిని వినియోగించారు. సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ (సీజీడబ్ల్యూబీ) నివేదికల ప్రకారం, తెలంగాణలో వ్యవసాయం కోసం భూగర్భ జలాల వినియోగం 2019-20లో 235 టీఎంసీల నుంచి 2022 నాటికి 256 టీఎంసీలకు పెరిగింది. తెలంగాణ భూగర్భ జల వినియోగం విషయంలో అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం (జియోలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా జర్నల్ -వాల్యూమ్ 97 మార్చి 2021) 1875లో బావుల కింద కేవలం 46వేల హెక్టార్లు మాత్రమే సాగు అయ్యేది. దాని విస్తీర్ణం క్రమ క్రమంగా పెరుగుతూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం (2014 నాటికి) 15లక్షల 67వేల బోర్‌వెల్స్ ద్వారా 19 లక్షల హెక్టార్లకు చేరింది. అంటే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభం (జూన్ 21, 2019) తరువాత భూగర్భ జల మట్టాలు పెరిగాయని శాస్త్రీయ ఆధారాలు సైతం నిరూపిస్తున్నాయి.
కరువు తాండవానికి కారణం?
పదేండ్లు పండుగలా వ్యవసాయం చేసుకున్న తెలంగాణ రైతన్నకు నేడు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం శాపంగా మారింది. అనాలోచిత నిర్ణయాలు, కక్షసాధింపు రాజకీయాలతో ప్రాజెక్టులను పడావు పెట్టడంతో భూగర్భజలాలు అడుగంటిపోయాయి. చెరువులు, కుంటలు ఎండిపోయి బోర్లు, బావులు ఒట్టిపోతున్నాయి. నైరుతి ముఖం చాటేయటంతో రైతాంగం నైరాశ్యానికి గురి అవుతున్నది. ఎల్లపల్లి ప్రాజెక్టు ఎండిపోయేందుకు ఎంతోకాలం పట్టేలా లేదు. ఎల్ఎండీ, మిడ్‌మానేరు ఆటస్థలాలుగా మారిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే రైతులు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున లక్షలు ఖర్చుపెట్టి మళ్లీ బోరు వేస్తున్నారు. అయినా పాతాళగంగ కరుణ చూపడం లేదు.
మూడు దశాబ్దాలు వెనక్కి
కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తానికి మేడిగడ్డ బరాజ్ జీవగడ్డ. మూడేండ్ల క్రితం ఆ బరాజ్‌కు ఉన్న రెండు పిల్లర్లకు పర్రెలు పడితే వాటికి మరమ్మతు చేసి ఉన్న వ్యవస్థను వినియోగంలోకి తెచ్చుకుంటే ఇంతటి ఎల్‌నినో ప్రభావాన్ని సైతం తట్టుకొని తెలంగాణ రైతాంగం నిటారుగా నిలబడేది అని జలరంగ నిపుణులు చెబుతున్నారు. ఎక్కడ కేసీఆర్ ఖాతాలో కీర్తిని జమచేయాల్సి వస్తుందోనని కాంగ్రెస్ ప్రభుత్వం బాగు చేసేందుకు జంకుతున్నది. 5 నెలలుగా వాతావరణ శాస్త్రవేత్తలు ఎల్‌నినో ప్రమాదం ముంచుకొస్తున్నదని హెచ్చరిస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా హుటాహుటిన ఎల్‌నిలో ప్రభావ అంచనాలను కొలిచేందుకు ఉమ్మడి జిల్లాకో ప్రత్యేక అధికారిని నియమించి ‘ఏం చేస్తే ఎల్‌నినోను ఎదుర్కొవచ్చో కనుగొనండి’ అంటూ ఆదేశించడం, అంతకు ఒక్కరోజు ముందే ఆరుతడి పంటలు వేసుకోవాలని రాష్ట్ర మంత్రివర్గం తీర్మానించడం వంటి పరిణామాలు రాష్ట్ర రైతాంగాన్ని కలచివేస్తున్నది. ఇక రాష్ట్రవ్యాప్తంగా భూగర్భ పరిభాషలో ఒక్క మీటరు లోతుకు నీరు పోతే ఆ పరిమాణంలో 100 టీఎంసీల నీరు పోయినట్టేనని వాతావరణ, భూభౌతిక శాస్త్రవేత్తలు తేల్చిచెప్తున్నారు.
2025-26 ఆర్థిక సర్వే ఏం చెప్పిందంటే?
తెలంగాణలో 2014 నుంచి సాగు విస్తీర్ణంలో గణనీయమైన పెరుగుదల నమోదైంది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్, మిషన్ కాకతీయ పథకాల వల్లే ఈ సాగు విస్తీర్ణం దాదాపు 70 శాతం పెరిగిందని ఆర్థిక సర్వే 2025-26 స్పష్టం చేసింది.
తెలంగాణలో 2014 నాటికి 1.31 కోట్ల ఎకరాలుగా ఉన్న సాగువిస్తీర్ణం 2023-24 నాటికి 2.2 కోట్ల ఎకరాలకు పెరిగింది. ‘పంట దిగుబడులు పెంచటానికి సాగునీటి సదుపాయాల కల్పన, సహజ వనరులకు అనుగుణంగా పంటల సాగు ఎంపిక, వాతావరణ మార్పులను తట్టుకొని అధిక దిగుబడినిచ్చే వంగడాలను వినియోగించడం వల్లే తెలంగాణ వ్యవసాయ రంగంలో పురోగమించింది’ అని దేశ ఆర్థిక సర్వే (అగ్రికల్చర్ అండ్ ఫుడ్మేనేజ్మెంట్: రైజింగ్ ప్రొడక్టివిటీ ఇన్కమ్స్ అండ్ ఎన్స్యూరింగ్ ఫుడ్ సెక్యూరిటీ (చాప్టర్ 6, ఆర్థిక సర్వే 2025-26, పేజీ నెంబర్ 231) 2025-26 తేల్చిచెప్పటం గమనార్హం.
11 బోర్లు వేసిన
మాది మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలోని పడమటిగూడెం. నాకు ఎకరం 10 గుంటల భూమి ఉన్నది. రోడ్డుపక్కన ఉండటంతో కూరగాయలు సాగుచేద్దామనుకున్న. ఉన్నబావి ఎండిపోయింది. మొన్న జూన్‌లో 5 బోర్లు వేసిన. ఈ మధ్య మరో 6 బోర్లేసిన. మొత్తం 11 బోర్లు వేసినా చుక్క నీరు రాలె. రెండు నెలల్లో మూడున్నర లక్షలు ఖర్చుచేసిన. 250 ఫీట్లలోతుకు పోయినా నీళ్లు పడలే. కౌలుకు తీసుకొని పత్తి గింజలు పెడితే మొలకెత్తి వాడిపోతున్నది. -చిదిమళ్ల భిక్షం, పడమటిగూడెం, నర్సింహులపేట మండలం.
ఈసారి ఎవుసం ఎల్లదీసుడు కష్టమే
మాది రాయపర్తి (వరంగల్ జిల్లా). మైలారం (రిజర్వాయర్) కింద మూడెకరాలున్నది. పదేండ్లు నీళ్లు పు ష్కలంగ వచ్చినయి. ఇప్పుడు చూద్దామంటే కంటికి కనిపిస్తలేవు. నా 70 ఏండ్లల్ల ఇసొంటి కాలం ఎప్పుడూ చూడలె. రోహిణి కార్తెలో నార్లు పోసుకొని నాట్లు వేసుకుంటే ఆరుద్ర ఎల్లుదలకు వరి చేన్లు కలుపులకు వచ్చేది. కానీ, ఇదేం కాలమో…నారుమడి కూడా పారుడు లేదు. రిజర్వాయర్‌లో నీళ్లు లేవు. ఉన్న రెండు బోర్లు ఎండిపోయినయి. నారుమడిని సూత్తాంటే పానం పోయినంత పనైతాంది. ఎట్లయితే అట్లయిందని ధైర్యం చేసి మొన్న 200 ఫీట్లలోతు బోరు వేసిన. బోరుపడ్డది. కొత్త మోటారు కనెక్షన్ కోసం రూ. లక్ష ఖర్చయింది.
– పరుపాటి మధుసూదన్‌రెడ్డి, రైతు, మైలారం, రాయపర్తి మండలం, వరంగల్ జిల్లా
మూడు బోర్లేసినా నీళ్లొస్తయనే గ్యారెంటీ లేదు
మాది కోటపల్లి దగ్గర సర్వాయిపేట (మంచిర్యాల జిల్లా). ఊరిచెరువులో నీళ్లు లేవు. చెరువు కిందే నాకున్న ఎకరం 27 గుంటలు సాగయ్యేది. చెరువు ఎండిపోయింది. దీంతోని ఆరు లక్షలు ఖర్చుపెట్టి మూడు బోర్లు వేసిన. ఫస్ట్ రెండు బోర్లు కూలినవి. నీళ్లు పడలేదు. కానీ, మూడోబోర్ పడ్డది. కానీ, అందులో నీళ్లు ఎన్ని రోజులు వస్తాయో తెలియదు. ఈసారి అంతా ఆగమాగం ఉన్నది.
-మనోజ్, సర్వాయిపేట, కోటపల్లి మండలం, మంచిర్యాల