హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ): అధిక వడ్డీ చెల్లిస్తామంటూ అనధికారికంగా 7,056 మంది నుంచి రూ.4,215 కోట్ల డిపాజిట్లు వసూలు చేసిన కేసులో ఏ5 నిందితుడు, ఫాల్కన్ గ్రూప్ సీవోవో ఆర్యన్ సింగ్‌ను తెలంగాణ సీఐడీ పోలీసులు అరెస్టు చేసినట్టు డీజీ చారుసిన్హా వెల్లడించారు. ఈ కేసులో 4,065 మంది బాధితులు రూ.792 కోట్ల వరకు మోసపోయినట్టు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. అధిక వడ్డీ ఆశచూపిన నిందితులు.. ‘ఫాలన్ ఇన్ వాయిస్ డిసౌంటింగ్’ అప్లికేషన్‌ను అభివృద్ధి చేయడం ద్వారా వేల మంది డిపాజిటర్లను మోసగించారు. ఈ ఏడాది వెలుగు చూసిన ఈ మోసంపై 3 కేసులు నమోదయ్యాయని, వాటిని సీఐడీకి బదిలీ చేయడంతో నిందితులను వరసగా అరెస్టు చేస్తున్నారని వివరించారు.
ఆర్థిక సహకారానికి ‘బ్రిక్స్’ బెస్ట్ ; బ్రిక్స్‌లో భారత ప్రధాని మోదీ
రియో డి జనీరో: ఆర్థిక సహకారానికి, ప్రపంచ మేలుకు శక్తివంతమైన గ్రూప్‌గా బ్రిక్స్ కొనసాగుతోందని ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం అన్నారు. బ్రిక్స్ సదస్సు కోసం బ్రెజిల్‌లోని సముద్ర తీర నగరమైన రియో డి జనీరోలో సభ్య దేశాల అగ్ర నాయకులు సమావేశమయ్యారు. ప్రస్తుతం బ్రిక్స్‌కి అధ్యక్ష స్థానంలో ఉన్న బ్రెజిల్ ఆతిథ్యంలో జరిగిన సదస్సుకు చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గైర్హాజరయ్యారు. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికాతో ప్రారంభమైన బ్రిక్స్‌లో ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్ 2024లో చేరగా యూఏఈ, ఇండోనేషియా 2025లో చేరాయి. ఐదు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ శనివారం రాత్రి ఇక్కడకు చేరుకున్నారు. ఘనా, త్రినిడాడ్, టుబాగో, అర్జెంటీనా దేశాల పర్యటన ముగించుకుని మోదీ ఇక్కడకు వచ్చారు.