హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): నకిలీ ట్రేడింగ్ యాప్‌తో అమాయకులను మోసగిస్తూ ఆన్లైన్ లావాదేవీల ద్వారా రూ.10 కోట్ల వరకు కాజేసిన నలుగురు సభ్యుల ముఠాను సైబరాబాద్ సైబర్‌క్రైం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.9.84 కోట్ల నగదు స్వాధీనం చేసుకొన్నారు. సైబర్‌క్రైం కేసుల్లో ఒకేసారి ఇంత మొత్తం నగదును రికవరీ చేయడం దేశంలో ఇదే తొలిసారని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీం ద్ర చెప్పారు. ఈ కేసు వివరాలను క్రైం డీసీపీ కమలేశ్వర్తో కలిసి సోమవారం ఆయన మీడియాకు వివరించారు. ఉత్తరప్రదేశ్‌లోని చం దౌలి జిల్లాకు చెందిన అభిషేక్ జైన్ అనే వ్యా పారి ‘మార్కెట్ బాక్స్’ అనే యాప్ రూపొందించి ఈ దందాకు తెరలేపాడు. ఆయనకు రాజస్థాన్ ఫిన్‌టెక్ వ్యాపారి పవన్‌కుమార్ ప్ర జాపత్ (35), అదే ప్రాంతానికి చెందిన ఆకాశ్ రాయ్, యూపీ హవాలా వ్యాపారి కృష్ణకుమా ర్ సహకరించారు. మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ (సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ బో ర్డ్ ఆఫ్ ఇండియా)లో నమోదుకాని ఈ యాప్ ద్వారా దాదాపు 3 వేల మంది లావాదేవీలు జరిపారు. ఈ దందాలో రూ.27.90 లక్షలు కోల్పోయిన ఓ హైదరాబాదీ గత డిసెంబర్ చేసిన ఫిర్యాదు మేరకు నిందితులను పోలీసు లు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.9.84 కోట్ల నగదుతోపాటు 7 సెల్ఫోన్లు, 2 ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకొన్నారు. కేసును ఛేదించడంలో కీలక పాత్ర పోషించిన సిబ్బందికి సీపీ రివార్డులు అందజేశారు.