హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సచివాలయం భద్రతాపరంగా అత్యంత దుర్భేద్యం. మీడియా సిబ్బందిని సైతం మూడు పాస్‌లు ఉంటేనే లోపలికి అనుమతిస్తారు. ఏ స్థాయివారైనా ఎటువంటి అనుమతి పత్రం లేకుండా లోపలికి వెళ్లడం అసాధ్యం. సచివాలయంలో పనిచేసే ప్రభు త్వ అధికారులు సైతం తమ విభాగాలకు వెళ్లాలన్నా అనేక శల్య పరీక్షలు, వడపోతల అనంతరమే అనుమతిస్తారు. భవనం లోపల సైతం ప్రతి ఫ్లోర్లో, ప్రతి ఎంట్రెన్స్ దగ్గర పోలీసుల ప్రశ్నలకు జవాబు చెప్పాల్సిందే. కానీ గత రెండున్నరేండ్ల కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కొందరు అవలీలగా భద్రతా సిబ్బందిని బురిడీ కొట్టించి లోపలికి వెళ్లిపోతున్నారు. ఈ నకిలీలు అధికార దర్పంతో లోపలికి వెళ్లడమే కాకుండా బయటకు వచ్చి తామే అసలైన అధికారుల లాగా చలామణి అవుతూ పలువురిని మోసపుచ్చిన ఘటనలు ఇటీవల వెలుగులోకి వచ్చాయి. వీరి మోసాలు బయటపడేంత వరకు వీరు నకిలీలు అన్న సంగతి సచివాలయ వర్గాలకు తెలియకపోవడం విస్మయం కలిగించింది.
ఈ నకిలీ అధికారులు, పోలీసులు లోపలికి వెళ్లడమే కాకుండా రీల్స్ చేసి పని ఉంటే చెప్పండి చేసి పెడుతామంటూ ఇన్‌స్టా వేదికగా చేస్తున్న రీల్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. తాజాగా జరిగిన నిఖిల్ యాదవ్ ఉదంతం రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టకు సవాలుగా మారింది. హై సెక్యూరిటీ జోన్ డొల్లతనం నకిలీ పోలీస్ రీల్‌తో బట్టబయలైంది. నిఖిల్ యాదవ్ ఏకంగా పోలీస్ యూనిఫాంతో సచివాలయం లోపలికి వెళ్లడమే కాకుండా లోపలే రీల్స్ చేసేంతవరకు భద్రతా వ్యవస్థ, నిఘా వర్గాలు పసిగట్టకపోవడం చర్చనీయాంశంగా మరింది.
ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలీస్ అధికారిగా నటించిన నిఖిల్ సీఎం రేవంత్‌రెడ్డిని కలిపిస్తానని, ఐపీఎల్ టికెట్లు ఇప్పిస్తానని చేసిన వీడియో వైరల్‌గా మారింది. తాను సచివాలయంలోనే డ్యూటీలో ఉన్నానని, ఎవరైనా సీఎం రేవంత్‌రెడ్డిని కలువాలంటే తనకు ఫోన్‌చేయాలని చెప్పాడు. ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లిన తరువాతనే అతడు నకిలీ అన్నది వెలుగులోకి వచ్చింది. అతనికి నేర చరిత్ర ఉన్నదని, పలు కేసులు ఉన్నాయని సమాచారం.
అయితే అత్యంత పటిష్ఠమైన భద్రత ఉన్న సచివాలయంలోకి ఓ నకిలీ వ్యక్తిరావడం, పోలీసుల పేరు వాడుకోవడం, రీల్స్ చేయడంపై అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలా నకిలీ గుర్తింపు కార్డులతో డజనుకుపైగా వ్యక్తులు పలు సందర్భాల్లో సచివాలయంలోకి ప్రవేశించిన ఘటనలు గతంలో జరిగిన సంగతి తెలిసిందే. కొందరు మంత్రుల పేషీలను వాడుకొని పైరవీలు చేయగా, మరికొందరు ఉద్యోగాలిప్పిస్తామంటూ నిరుద్యోగులను నిలువునా ముంచిన ఘటనలు ఉన్నాయి. అధికారులు ఇప్పటికైనా భద్రతాపరంగా పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని పలువురు సూచిస్తున్నారు.
ఖైరతాబాద్: పోలీస్ దుస్తులు ధరించి సచివాలయంలో రీల్స్ చేసిన నిఖిల్ యాదవ్ (31)ని పోలీసులు అరెస్టు చేశారు. అంబర్‌పేట వాసవీ నగర్‌కు చెందిన తటూరి రవి అలియాస్ చరణ్ అలియాస్ నిఖిల్ యాదవ్ (31) హోటల్లో వర్కర్‌గా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం ఖాళీ ఉండటంతో పోలీసు అవతారమెత్తి ప్రజలను మోసం చేయాలని అనుకున్నాడు. పాతబస్తీలో పోలీసు యూనిఫామ్ కొనుగోలుచేసి సచివాలయంలోకి ప్రవేశించాడు.
తాను సీఎం భద్రతా విభాగంలో పనిచేస్తున్నానంటూ నమ్మబలికాడు. ఎలాంటి ముందస్తు అపాయింట్మెంట్ లేకుండా ముఖ్యమంత్రితో నేరుగా సమావేశాలు ఏర్పాటు చేయిస్తానంటూ పలువురిని నమ్మించాడు. అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు సెక్షన్ 204, 205, 319, 318(4), 353 బీఎన్‌ఎస్‌తోపాటు సెక్షన్ 66డీ ఐటీ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.