హైదరాబాద్, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ): నిజాంల కాలం నుంచి వివాదంలో ఉన్న భూములపై హకుల కోసం హైకోర్టు పేరుతో నకిలీ ఉత్తర్వులు సృష్టించడంపై ఉన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తంచేసింది. ఇది న్యాయపరిపాలనలో జోక్యం చేసుకోవడమేనని మండిపడింది. ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని జ్యుడీషియల్ రిజిస్ట్రార్‌ను ఆదేశించింది. ఈ ఫిర్యాదుపై దర్యాప్తు నిమిత్తం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం(సిట్)ను ఏర్పాటుచేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లోని భూముల మీద హకులపై మహమ్మద్ తాహెర్ఖాన్కు అనుకూలంగా సివిల్ కోర్టు ఇచ్చిన ఆదేశాలపై హెచ్ఎండీయే అప్పీలు దాఖలుచేసింది. దీనిపై జస్టిస్ టీ వినోద్‌కుమార్, జస్టిస్ పీ శ్రీసుధతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే కోర్టు పేరిట నకిలీ ఉత్తర్వులు ఉన్నట్టు గమనించిన ధర్మాసనం విచారణకు ఆదేశించింది.
హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న సీఎస్ 7/1958లో దరఖాస్తుకు సంబంధించి 1988 డిసెంబరు 28న న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ ఎన్డీ పట్నాయక్ 1988 ఏప్రిల్ 29న న్యాయమూర్తిగా రాకముందే ఉత్తర్వులు జారీచేసినట్టు నకిలీ పత్రాలు సృష్టించారు. దీనిపై విచారణ చేపట్టి నివేదిక సమర్పించాలని కోర్టు రిజిస్ట్రార్‌ను ఆదేశించింది. కోర్టు రికార్డుల్లో అసలు పిటిషనే లేదని, ఆ నంబరుతో ఎలాంటి ఫైలు లేకపోయినా నకిలీ ఉత్తర్వులు సృష్టించారని తెలుపుతూ రిజిస్ట్రార్ నివేదిక సమర్పించారు. గతంలో కూడా ఇలా నకిలీ ఉత్తర్వులపై రెండు ఫిర్యాదులు ఉన్నట్టు పేరొన్నారు. ఈ నేపథ్యంలో నకిలీ ఉత్తర్వుల వ్యవహారంలో బాధ్యులపై చర్య తీసుకొనేందుకు పోలీసులకు ఫిర్యాదు చేయాలని ధర్మాసనం రిజిస్ట్రార్‌ను ఆదేశించింది. ఈ ఫిర్యాదుతోపాటు ఇప్పటికే నమోదైన రెండు ఎఫ్ఐఆర్లపై వీలైనంత త్వరగా దర్యాప్తు పూర్తిచేయడానికి సిట్ ఏర్పాటుచేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అప్పటివరకు శంషాబాద్‌లోని భూములపై యథాతథస్థితి కొనసాగుతుందని స్పష్టంచేసింది.