మఠంపల్లి, జూలై 18 : నకిలీ డీఏపీ ఎరువుల తయారీ ముఠా గుట్టును సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ పోలీసులు రట్టుచేశారు. సీఐ చరమంద రాజు తెలిపిన వివరాల ప్రకారం ఇలా.. హుజూర్నగర్ ప్రాంతానికి చెందిన ఓ రైతు నకిలీ డీఏపీ కొనుగోలు చేసిన ఘటనపై నమోదైన కేసు విచారణలో కీలక ఆధారాలు లభించాయి. వాటి ఆధారంగా పోలీసులు హైదరాబాద్ శివారు పెద్ద అంబర్‌పేటలోని గోదాముపై మెరుపు దాడి నిర్వహించారు. తనిఖీల్లో సాల్ట్, గ్రోమోర్, కోరమాండల్, అన్నపూర్ణ తదితర ప్రముఖ కంపెనీల పేర్లతో ఉన్న ఖాళీ సంచుల్లో ఉప్పు, మట్టి తదితర నాసిరకం పదార్థాలను రసాయనాలతో కలిపి డీఏపీ తయారు చేస్తున్నట్టు గుర్తించారు. ప్రింటింగ్, స్టిచింగ్ యంత్రాలతో అసలు ఎరువుల సంచుల మాదిరిగానే ప్యాకింగ్ చేసి రైతులను మోసగిస్తున్నట్టు నిర్ధారించారు. నకిలీ ఎరువులను మేళ్లచెరువు, నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి తదితర ప్రాంతాలకు ఏజెంట్ల ద్వారా సరఫరా చేస్తున్నట్టు తమ విచారణలో తేలిందని ఇన్స్పెక్టర్ రాజు తెలిపారు. స్వాధీనం చేసుకున్న నకిలీ ఎరువులను వ్యవసాయశాఖ అధికారులకు అప్పగించినట్టు పేర్కొన్నారు. వీటి విలువ రూ.1.5 కోట్లు ఉంటుందని చెప్పారు. పరారీలో ఉన్న నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నట్టు తెలిపారు.