హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ): ప్రజల ప్రాణాలకు హాని కలిగించే నకిలీ ఆహార పదార్థాలు తయారు చేసే ముఠా గుట్టు రట్టయ్యింది. కాటేదాన్, నాగారం కేంద్రంగా ఈ ముఠా నకిలీ వస్తువులను ప్రముఖ బ్రాండ్ల పేరిట విక్రయిస్తున్నది. దాడి చేసిన టాస్క్‌ఫోర్స్ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నది. రాజస్థాన్‌కు చెందిన ముఠాగా గుర్తించారు. నిందితుల నుంచి సుమారు రూ.2కోట్ల విలువ చేసే సొత్తును స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. డీసీసీ కార్యాలయంలో విలేకరులకు ఈస్ట్‌జోన్ డీసీపీ రష్మీ పెరుమాళ్ కేసు పూర్వాపరాలను వెల్లడించారు. దాడుల్లో సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాజు నాయక్, కాచిగూడ ఇన్స్పెక్టర్ ఎన్.రామలక్ష్మణ్ రాజు పాల్గొన్నారు.