హైదరాబాద్, మే 15 (నమస్తే తెలంగాణ): టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(టెట్) హాల్‌టికెట్ల జారీలో విద్యాశాఖ పూర్తిగా విఫలమైంది. నిర్లక్ష్యంగా వ్యవహరించి అభ్యర్థుల జీవితాలతో ఆటలాడుకుంటోంది. బుధవారం విడుదల కావాల్సిన టెట్ హాల్‌టికెట్లను జారీచేయలేదు. దీంతో అభ్యర్థులకు టెన్షన్ పట్టుకుంది. టెట్ పరీక్షలు ఈ నెల 20 నుంచి ప్రారంభంకానున్నాయి. మే 15న హాల్‌టికెట్లు విడుదలచేస్తామని నోటిఫికేషన్లోనే పొందుపరిచారు.
ఇదే అంశంపై మంగళవారం ‘నమస్తే తెలంగాణ’ అధికారులను సంప్రదించగా, బుధవారం టెట్ హాల్‌టికెట్లను విడుదల చేస్తామన్నారు. టెట్ కన్వీనర్ రాధారెడ్డి సైతం హాల్‌టికెట్ల జారీకి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కానీ రాత్రివరకు కూడా హాల్‌టికెట్లను విడుదల చేయలేదు. దీంతో అభ్యర్థులంతా టెట్ హాల్‌టికెట్ల కోసం పడిగాపులు పడ్డారు. అయితే గురువారం నుంచి హాల్‌టికెట్లు అందుబాటులో ఉంటాయ ని అధికారులు బుధవారం రాత్రి ప్రకటించారు.