బుధవారం 03 జూన్ 2020
Telangana - Feb 05, 2020 , 01:22:05

ఫేస్‌ రికగ్నిషన్‌ ఓటింగ్‌ విజయవంతం

ఫేస్‌ రికగ్నిషన్‌ ఓటింగ్‌ విజయవంతం
  • సరైన వెలుతురులేక కొన్నిచోట్ల ఇబ్బందులు
  • ఈసీకి నివేదించిన రాష్ట్ర ఎన్నికల సంఘం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో ఇటీవల మున్సిపల్‌ ఎన్నికల్లో చేపట్టిన ఫేస్‌ రికగ్నిషన్‌ ప్రయోగం విజయవంతమైంది. దేశంలోనే తొలిసారి మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 10 పోలింగ్‌ కేంద్రాల్లో ఫేస్‌ రికగ్నిషన్‌ యాప్‌ ద్వారా పోలింగ్‌ నిర్వహించిన విషయం తెలిసిందే. తెలంగాణ స్టేట్‌ టెక్నాలజీ సర్వీసెస్‌ రూపొందించిన పెన్షనర్ల సెల్ఫీ యాప్‌ ఆధారంగా ఫేస్‌ రికగ్నిషన్‌ ఓటింగ్‌ చేపట్టారు. దీనిలో మొత్తం 80 శాతం పోలింగ్‌ నమోదయిందని, కొన్ని పోలింగ్‌ కేంద్రాల్లో వెలుతురు సరిగా లేకపోవడంతో ముఖ గుర్తింపు జరుగలేదని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) ప్రకటించింది. పోలింగ్‌ ప్రక్రియ ముగిసిన వెంటనే సదరు యాప్‌, మొబైళ్ల నుంచి డాటాను తొలగించామని, ఫేస్‌ రికగ్నిషన్‌ పోలింగ్‌ ప్రక్రియ మొత్తాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదించామని అధికారులు తెలిపారు. 


రాష్ట్రంలో ప్రభుత్వ పెన్షనర్ల కోసం సెల్ఫీ యాప్‌ను రూపొందించారు. సెల్ఫీ తీసి ఈ యాప్‌లో నమోదుచేస్తే వారు లైవ్‌ సర్టిఫికెట్‌ ఇవ్వకున్నా పెన్షన్‌ సొమ్మును వారి ఖాతాలకు బదిలీచేస్తున్నారు. ఈ యాప్‌ సాయంతోనే మున్సిపల్‌ ఎన్నికల్లో ముఖ గుర్తింపు ద్వారా ఓటువేసే విధానాన్ని ప్రయోగాత్మకంగా చేపట్టారు. ఇందుకోసం ప్రత్యేకాధికారులను నియమించి, వారికి మొబైల్‌, ల్యాప్‌ట్యాప్‌లను ఇచ్చారు. కాగా ఫేస్‌ రికగ్నిషన్‌ యాప్‌ ద్వారా ఓటేసే విధానంపై ఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్‌ ఒవైసీ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విధానం వల్ల ముస్లిం మహిళలకు ఇబ్బంది ఉంటుందని ఆయన ఎన్నికల సంఘానికి రాసిన లేఖలో పేర్కొన్నారు.


logo