హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లింపు గడువును 30 వరకు పొడగించాలని తెలంగాణ స్టేట్ గెజిటెడ్ హెడ్మాస్టర్స్ అసోసియేషన్ (టీఎస్ జీహెచ్ఎంఏ) కోరింది. శుక్రవారం ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావును కలిసి వినతిపత్రాన్ని సమర్పించింది. ఫీజు చెల్లింపు విషయంలో సాంకేతిక ఇబ్బందులు తలెత్తుతున్నాయని, ఫీజు చెల్లింపు గడువును పొడగించాలని అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రాజభాను చంద్రప్రకాశ్, ప్రధాన కార్యదర్శి రాజగంగారెడ్డి కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ఫీజు మినహాయింపు ఇవ్వాలని, 33 జిల్లాల్లో మూల్యాంకన కేంద్రాలను ఏర్పాటు చేయాలని విన్నవించారు.