హైదరాబాద్, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన న్యాయవాదుల చట్ట సవరణ బిల్లు ఆమోదయోగ్యం కాదని, న్యాయనిపుణుల సలహాలు, సూచనలు లేకుండా సవరణలు తీసుకొస్తే బార్‌కౌన్సిల్ స్వతంత్ర ప్రతిపత్తి ప్రశ్నార్థకంగా మారుతుందని ఆలిండియా లాయర్స్ యూనియన్ తెలంగాణ రాష్ట్ర కమిటీ అభిప్రాయపడింది. ఈ చట్టం తీసుకొస్తే న్యాయవాద వృత్తి మనుగడకే ప్రమాదం ఏర్పడుతుందని కమిటీ చెప్పారు. ఈ మేరకు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మీడియా సమావేశంలో కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సత్యనారాయణ, పార్థసారథి మాట్లాడారు. 1961 చట్టాన్నే కొనసాగించాలని, విదేశీ లాయర్లను అనుమతించవద్దని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ ముసాయిదా బిల్లుపై అభ్యంతరాలు, సలహాలు, సూచనలతో బుక్‌లెట్‌ను విడుదల చేశారు. ఆందోళనలు, నిరసనలు, ఉద్యమాలు చేయకుండా న్యాయవాదులను అణిచివేసే ప్రక్రియే కొత్త ముసాయిదా చట్టమని చెప్పారు.
న్యాయవాద వృత్తిలోఉన్న వారికి మాత్రమే బార్ కౌన్సిళ్లకు ప్రాతినిధ్యం వహించాలని అభిప్రాయపడ్డారు. కొత్త ప్రతిపాదిత ముసాయిదాలో తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ అనే పేరే లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. సవరణ చట్టం ప్రతిపాదనల్లో మహిళలు, ఎస్సీ, ఎస్టీ న్యాయవాదులకు రిజర్వేషన్లు కల్పించే ప్రతిపాదనలేవీ లేవని సత్యనారాయణ గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వం ఇష్టానుసారం న్యాయవాద చట్టాన్ని సవరించాలని చూస్తే దేశవ్యాప్త ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కొత్త బిల్లుపై ఇప్పటికే పరిశీలనలు, ప్రతిపాదనలతో కూడిన వినతిపత్రాన్ని కేంద్రప్రభుత్వానికి పంపినట్టు తెలిపారు. ఈ సమావేశంలో సంఘం నాయకులు రామచంద్రారెడ్డి, శ్రీనివాసరెడ్డి, వెంకటరెడ్డి, శ్రీనివాసరావు, మాధవరెడ్డి, వెంకటేశ్, శర్మ, వేణుగోపాల్, రమేశ్‌కుమార్ మకడ్ తదితరులు పాల్గొన్నారు.