సిరిసిల్ల టౌన్, జూలై 16: పక్షవాత బాధితుడికి వైద్యులు సకాలంలో ఖరీదైన చికిత్స అందించి శాశ్వత వైకల్యం, ప్రాణాపాయం నుంచి తప్పించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ దవాఖాన పర్యవేక్షకుడు డాక్టర్ మురళీధర్‌రావు నేతృత్వంలో వైద్యులు ఈ ఘనత సాధించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం రామచంద్రాపూర్‌కు చెందిన బొడ్డు లక్ష్మీరాజం ఈ నెల 14న పక్షవాతం బారినపడ్డాడు. కుటుంబసభ్యులు మూడు గంటల్లోపే సిరిసిల్ల ప్రభుత్వ దవాఖానకు తరలించారు. వైద్యులు అరుణ, బాబు వెంటనే స్పందించి లక్ష్మీరాజానికి అవసరమైన పరీక్షలు చేశారు. నిమ్స్ వైద్యుల సలహాలు, సూచనలు పాటిస్తూ నాలుగు గంటల్లోపే టీపీఏ (టిష్యూ ప్లాస్మినోజెనిక్ యాక్టివేటర్) లాంటి క్లాట్ బ్లస్టరింగ్ మందులతోపాటు రూ.40 వేల ఖరీదైన టీపీఏ ఇంజక్షన్ ఇచ్చారు.
ఈ దవాఖానలో ఈ ఇంజక్షన్ వాడటం ఇదే తొలిసారి కావడం విశేషం. లక్ష్మీరాజానికి మెరుగైన చికిత్స అందించి శాశ్వత వైకల్యం, ప్రాణాపాయం నుంచి తప్పించారు. బాధితుడు 90 శాతం కోలుకొన్నాడని, పూర్తిగా కోలుకొన్నాక డిశ్చార్జి చేస్తామని వైద్యులు పేర్కొన్నారు. మూడు గంటల్లోపే దవాఖానకు తీసుకురావడం, దవాఖానలో ఆధునిక సేవలు అందుబాటులో ఉండటంతోనే ఇది సాధ్యమైందని దవాఖాన సూపరింటెండెంట్ మురళీధర్‌రావు తెలిపారు. మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు ప్రత్యేక చొరవ, కలెక్టర్ సహకారంతో ఖరీదైన మందులు, అధునాతన సేవలు జిల్లా దవాఖానలో అందుబాటులో వచ్చాయన్నారు.