Shakil Aamir | హైదరాబాద్ : జూబ్లీహిల్స్ కేసులో నా కుమారుడి ప్రమేయం లేదు.. తనే డ్రైవింగ్ చేసినట్లు ఒప్పుకోక పోతే నా కొడుకుని చంపుతామని పోలీసులు బెదిరిస్తున్నారు అని మాజీ ఎమ్మెల్యే షకీల్ పేర్కొన్నారు. పోలీసులు అన్యాయంగా నా కొడుకుని కేసుల్లో ఇరికిస్తున్నారు. నా కొడుకు రాహిల్ తప్పు చేసినట్లు నిరూపితమైతే చట్టపరంగా ఉరి తీయండి అని షకీల్ చెప్పారు.
ఈ కేసులో డీసీపీ విజయ్ కుమార్, పోలీసులు నా కుమారుడు రాహిల్‌ను మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నారు. తప్పుడు కేసులు బనాయించి ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. మొత్తం వ్యవహారంపై సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. తనపై రాజకీయ కక్ష ఉంటే తన కుమారుడు రాహిల్‌ను ఇబ్బంది పెట్టడం ఎందుకు..? కేసును పారదర్శకంగా విచారణ చేయాలని సీఎంను కోరుతున్నాను. తన ఆరోగ్యం బాగాలేకపోయినా.. తనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తన కుమారుడికి ఏమైనా హాని జరిగితే వెస్ట్ జోన్ డీసీపీ, పోలీసు అధికారులు బాధ్యత వహించాలి. జరుగుతున్న పరిణామాలపై రాజకీయ నాయకులు అందరూ ఆలోచించాలి అని షకీల్ పేర్కొన్నారు.